
రాయ్‌పూర్: యోగా చేసిన వారిని రాజయోగం వరిస్తుందని, అందుకే జవహర్‌లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీ దేశ ప్రధానులయ్యారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాయపూర్‌లో పతంజలి గ్రూప్‌కు చెందిన ఓ స్టోర్ ప్రారంభోత్సవంలో రాందేవ్ మాట్లాడారు. ఒత్తిడిని దూరంచేసే అతి ప్రాచీన విధానమైన యోగాను మన రాజకీయనేతలంతా అభ్యసించాలని రాందేవ్ కోరారు. నిరంతరం యోగా చేయడంతోనే రాజయోగం సిద్ధించి నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులయ్యారని, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సైతం యోగా బాగా చేస్తారని రాందేవ్ అన్నారు. టీ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి, సాధువైన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి యోగాతో వచ్చిన రాజయోగమే కారణమని రాందేవ్ వ్యాఖ్యానించారు. రాజకీయ రణరంగంలో గెలవాలంటే పోరాటపటిమనందించే యోగా తప్పనిసరి అని అన్నారు.
బుద్ధి చెప్పాలంటే యుద్ధం చేయాల్సిందే..
పుల్వామా ఉగ్రదాడి వంటి చర్యలతో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు యుద్ధం ద్వారానే భారత్ బుద్ధిచెప్పాలని రాందేవ్ అన్నారు. యుద్ధంలో ఓడిస్తే మరో 50 ఏళ్ల దాకా పాక్ భారత్‌వైపు కన్నెత్తికూడా చూడదన్నారు. పాకిస్తాన్ నైరుతి ప్రాంతమైన బలోచిస్తాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించాలని ఉద్యమిస్తున్న అక్కడి వేర్పాటువాదులకు భారత్ అన్నిరకాల సాయం అందించాలని రాందేవ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ద్వేషించే పాకిస్తానీయులకు భారత్ పూర్తిసాయం అందించి పాకిస్తాన్ పూర్తిగా నాశనమయ్యేలా చేయాలని రాందేవ్ అన్నారు. ‘ రాముడు ముస్లింలకు సైతం పూర్వీకుడే. అందుకే రామాలయ నిర్మాణానికి ముస్లింలు కూడా ముందుకు రావాలి’ అని రాందేవ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment