మోడీ యోగా చేస్తే, రామ్దేవ్ రాజకీయం చేస్తారట!
ఆదివారం అద్భుతం జరగబోతోంది. రాజకీయం చేసే నరేంద్ర మోదీ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో యోగా మహోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేస్తారు. మరో వైపు మోదీ పోటీచేస్తున్న వారణాసిలో యోగా గురు బాబా రామ్ దేవ్ మోదీ కోసం ఎన్నికల ప్రచారం చేస్తారు. తమాషా ఏమిటంటే రామ్ దేవ్ ప్రోగ్రాంలో రామ్ దేవ్ ఉండరు. మోడీ ప్రచారంలో మోడీ ఉండరు.
బాబా రామ్ దేవ్ సూచించిన నేతలకు బిజెపి టికెట్లు ఇవ్వకపోవడం, దానిపై యోగా గురు కోపంతో శీర్షాసనం వేశారని వార్తలు రావడం నేపథ్యంలో ఈ 'కుండమార్పిడి' రాజకీయం ప్రాధాన్యం సంతరించుకుంది. మామధ్య విభేదాలేమీ లేవు అని చెప్పక చెప్పేందుకు ఇద్దరు ప్రముఖులూ ఈ జోడు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
అయితే తనకు మోడీ మీద ఎలాంటి కోపమూ లేదని బాబా రామ్ దేవ్ పదేపదే చెబుతున్నారు. ఇవన్నీ మీడియా సృష్టే అని కూడా చెబుతున్నారు.
రాజు, ప్రజలు ఆధ్యాత్మిక గురువు చూపే బాటనే నడవాలన్న ప్రాచీన భారతీయ సిద్ధాంతం మేరకే ప్రజలు, నరేంద్ర మోదీలు యోగ మహోత్సవంలో పాల్గొంటున్నారని బాబా రామ్ దేవ్ శిష్య పరమాణువులు చెబుతున్నారు.