సాయుధ బలగాలు పడగొట్టిన ప్రహరీ గోడ
బల్వారా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్కు అతి పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యమే ఉంది. ఆయనకు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించిందంటే ఆ సామ్రాజ్యం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆశ్రమంలో రామ్పాల్ అనుచరులు 15వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆశ్రమం వద్దకు వెళితే ఆయన అనుచరులు పోలీసులపైనే తిరగబడ్డారు. అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలతో లోపల ఉన్న అనుచరులు తమతమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. సాయుధ బలగాల సహాయంతో హర్యానా పోలీసులు బుధవారం సాయంత్రం రామ్పాల్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అతను ముఖానికి వస్త్రం అడ్డుపెట్టుకున్నాడు. అతనిని రేపు కోర్టులో హాజరుపరుస్తారు. అరెస్ట్ సందర్భంగా ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు.
దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రామ్పాల్ అధిపతి. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో అతని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి చుట్టూ 50 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. లోపల 12 ఎకరాల విశాల స్థలం. ముఖ్య అనుచరులకు ఏసీ గదులు. ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్న లెక్చర్ హాళ్లు ఉన్న ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం. అనుచరులు, సేవకులు, సాయుధ ప్రై వేటు సైన్యంతో పాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఆయన సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీల్లో 25 లక్షలకు పైగా అనుచరులు, భక్తులున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని సమాచారం.
**