భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కుల ఘర్షణల్లో అరెస్ట్ చేసిన భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం అనూహ్యంగా విడుదల చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. 2017, మే 5వ తేదీన శహరాన్ పూర్ ఘర్షణల్లో హస్తం ఉందనే ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు ఠాకూర్లకు, దళితులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో శాంతిభద్రతల చట్టం కింద అరెస్ట్ చేసిన కొంత మంది ఠాకూర్లు ఎప్పుడో బెయిల్‌పై విడుదలయ్యారు. నాన్ బెయిలబుల్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఆయన ఇంతకాలం జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కేసు పూర్తయ్యేవరకు ఆయన్ని జైల్లోనే నిర్బంధించే అవకాశం ఉన్నప్పటికీ యూపీ ప్రభుత్వం విడుదల చేసిందంటే అందుకు రాజకీయ కారణాలు ఉండే ఉంటాయి.
అటూ కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా దళితుల పోరాటం ఎక్కువవుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత ఏప్రిల్ 2వ తేదీన దళితులు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించాలంటూ దళితులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ బిల్లును తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మే నెలలో కరియాన లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి దళితుల వ్యతిరేకతే కారణమని బీజేపీ అభిప్రాయపడింది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఉమ్మడిగా పోటీచేయడం కూడా వారికి కలసి వచ్చింది.
మాయావతి పార్టీ అంటే చంద్ర శేఖర్ ఆజాద్‌కు అసలు పడదు. ఆమెను అనేకసార్లు నేరుగా, ఘాటుగా ఆజాద్ విమర్శించారు. మాయావతికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ బలోపేతం అవుతున్నందున రానున్న ఎన్నికల్లో రెండు దళిత కూటముల మధ్య ఓట్లు చీలుతాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 2019 యూపీ సార్వత్రిక ఎన్నికల్లో వీలైనంత వరకు దళితుల ఓట్లను చీల్చడం వల్లనే లాభ పడవడవచ్చని భావించిన బీజేపీ, దూరదృష్టితో ఆజాద్‌ను విడుదల చేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment