మత మార్పిడి నిరోధక చట్టం తెద్దాం! | Religious conversion debate in Parliament: As it happened | Sakshi
Sakshi News home page

మత మార్పిడి నిరోధక చట్టం తెద్దాం!

Published Fri, Dec 12 2014 1:31 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

మత మార్పిడి నిరోధక చట్టం తెద్దాం! - Sakshi

మత మార్పిడి నిరోధక చట్టం తెద్దాం!

* లోక్‌సభలో చర్చకు బదులిస్తూ వెంకయ్యనాయుడు సూచన
* రాష్ట్రాలూ ఆ తరహా చట్టాలు చేయాలి
* మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాం
* ఆరెస్సెస్‌ను విమర్శిస్తే ఊరుకోం
* ప్రభుత్వ తీరుపై విపక్షం ధ్వజం


న్యూఢిల్లీ: మతమార్పిడుల నిరోధక చట్టాలను రూపొందించాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అన్ని పార్టీలు అంగీకరిస్తే.. సమగ్ర చర్చ జరిపి, మతమార్పిడి నిరోధక బిల్లును రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. లోక్‌సభలో గురువారం మతమార్పిడులపై జరిగిన చర్చకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బదులిస్తూ.. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను రూపొందించుకోవాలని సూచించారు. అలాగే, మత సామరస్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమైనా.. ఈ విషయంలో రాష్ట్రాలు కోరితే ఏ సాయమందించేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు.

అంతకుముందు, మతమార్పిడుల అంశం పార్లమెంటును వరుసగా రెండో రోజూ కుదిపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పలువురు ముస్లింలను హిందూ మతంలోకి మార్చిన అంశంపై విపక్షాలు కలసికట్టుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తి, లోక్‌సభలో చర్చకు అంగీకరించేలా చేశాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్ వద్దకు దూసుకెళ్లి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, మతమార్పిడుల అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘హిందూ, ముస్లిం, సిఖ్ భాయి భాయి’ అనే నినాదాలతో హోరెత్తించారు. వారి ఆందోళనను పట్టించుకోకుండానే స్పీకర్ మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు.

తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతూ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. దేశ లౌకిక ముద్రపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దేశంలో విషబీజాలు నాటుతూ, దేశానికి చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు.. ఇది తీవ్రమైన అంశమేనని, దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు కలసివస్తే మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా దేశ సమైక్యత, సమగ్రతలకు వచ్చిన ప్రమాదమేం లేదని, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలకు సూచించారు. చర్చకు పట్టుబడుతూ విపక్షాలు సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేశారు.

ఇవేనా మంచి రోజులంటే..?
మధ్యాహ్నం తరువాత మతమార్పిడులపై స్వల్పకాలిక చర్చను కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభిస్తూ.. ‘యూపీలో హిందూమతంలోకి మారితే రేషన్ కార్డులిస్తామని ముస్లింలకు హామీ ఇచ్చారు. ఇదేనా మీరు చెప్పిన మంచిరోజులు రావడం’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బలవంతపు మతమార్పిడుల గురించి ముస్లింలకు భయమేమీ లేదన్నారు. హిందూ సంస్థలను ప్రభుత్వం అదుపులో పెట్టాలని సూచించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రస్తావించిన సమయంలో బీజేపీ సభ్యులు గట్టిగా అరుస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కాషాయ తలపాగా ధరించినంతమాత్రాన స్వామి కాలేరంటూ సీపీఎం సభ్యుడు సలీమ్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మత మార్పిడులపై చర్చ అనవసరమని, ఇది యూపీలోని ఒక చిన్న ప్రాంతంలో జరిగిన చిన్న ఘటన అని ఎస్పీ అధినేత ములాయం పేర్కొన్నారు. అనంతరం చర్చకు వెంకయ్య నాయుడు బదులిస్తూ అబద్ధపు ప్రచారాలతో సంఘ్ పరివార్‌పై, మోదీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ‘ఆరెస్సెస్‌ను తిడు తుంటే మౌనంగా ఎలా ఉండగలను?’ అన్న వెంకయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం సహా ఇతర ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.

25న మళ్లీ మతమార్పిడి: హిందూ జాగరణ్‌ఙఞ్చటఆగ్రా: ఒకవైపు ఆగ్రా ఘటనపై దుమారం చెలరేగుతుండగానే, యూపీలోని అలీగఢ్‌లో హిందూమతంలోకి పునఃచేరిక కార్యక్రమాన్ని ఈ నెల 25న పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని హిందూ జాగరణ్ సమితి నేత రాజేశ్వర్ సింగ్ ప్రకటించారు. దీన్ని స్థానిక బీజేపీ ఎంపీ స్వాగతించారు. కాగా, ‘ఆగ్రా’ ఘటనపై సమగ్ర నివేదిక  సమర్పించాలంటూ కేంద్ర హోంశాఖ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మత మార్పిడి కార్యక్రమ మూలకర్త నందకిశోర్ బాల్మికి కోసం గురువారం పోలీసులు పలు చోట్ల గాలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement