చాలా చూశా.. ఖబడ్దార్!
తనను అడ్డుకునేందుకు యత్నించిన జేఏసీ నేతలపై ఎంపీ రేణుక ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి తెలంగాణ సెగ తగిలింది. ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న సవరణను వ్యతిరేకిస్తూ ఓయూ జేఏసీ నేతలు శనివారం ఢిల్లీలో ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ జేఏసీ చైర్మన్‌కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నేతలు విఠల్, అద్దంకి దయాకర్‌లతో పాటు బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నేతలు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, ఆలూరి గంగారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. వారు మాట్లాడి వెళ్లిన కొద్దిసేపటికి రేణుకా చౌదరి అక్కడకు చేరుకొని వారి ధర్నాలో కూర్చున్నారు. ఆమె ధర్నాకు హాజరైన విషయాన్ని గమనించిన ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల జేఏసీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
‘సీమాంధ్ర తొత్తుల్లారా ఖబడ్దార్’, ‘తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్’ అంటూ ఆమెను అక్కడ చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. దీనికి ఒకింత గట్టిగానే స్పందించిన రేణుక ‘నన్ను అడ్డుకుంటున్న నేతలు ఎప్పుడైనా ఉద్యమం చేశారా? తెలంగాణ కోసం వారు చేసిందేంటి?’ అని ప్రశ్నించారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో చూశానన్న రేణుక జేఏసీ నేతల వైపు వేలు చూపిస్తూ, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమయంలో ధర్నాలో పాల్గొన్న ఓయూ జేఏసీ నేతలు పిడమర్తి రవి, రమేశ్, జగన్ తదితరులు రేణుకను అడ్డుకుంటున్న జేఏసీ నేతలపై మండిపడ్డారు. మీరెప్పుడైనా ఉద్యమం చేశారా? అంటూ జేఏసీ నేతలపై తిరగపడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజకీయ జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్ కల్పించుకొని వారిని విడిపించారు. అనంతరం ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.
ఒక్క గ్రామాన్నీ వదలం: రేణుక
ఈ సందర్భంగా రేణుక విలేకరులతో మాట్లాడారు. ‘భద్రాచలం డివిజన్‌లోని ఒక్క గ్రామాన్నీ వదులుకునేందుకు సిద్ధంగా లేం. భద్రాచలం పరిధిలోని గ్రామాలన్నీ భద్రాద్రి రాముడితో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఆ అనుబంధాన్ని విడదీస్తే ఊరుకోం’ అని అన్నారు. అనంతరం జేఏసీ నేతలు విఠల్, అద్దంకి దయాకర్‌లు మాట్లాడుతూ ‘భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలుపుతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా రేణుక ఎందుకు నోరు మెదపలేదు? తెలంగాణ విద్యార్థులు తిన్నదరక్క చనిపోయారన్న రేణుక, నేడు తెలంగాణకై పోరాడతానంటే ఎవరూ నమ్మరు’ అని అన్నారు.