మునగాల ముమ్మాటికీ మాదే..
మునగాల, న్యూస్‌లైన్ : ‘భద్రాచలం మనదిరా.. మునగాల పరగణా మనదిరా’ అనే నినాదం తో తెలంగాణవాదులు పోరాటం చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌తోపాటు, భద్రాచలం, మునగాల పరగణా ప్రాంతాలు, వనరులపై పూర్తి అధికారాలున్న సంపూర్ణ తెలంగాణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా మునగాలలో గురువారం ‘ మునగాల పరగణా.. తెలంగాణ అంతర్భాగమే’ అనే అంశంపై జరిగిన సమావేశంలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణపై ఆంటోనీ కమిటీ, జీవోఎం అని యూపీఏ కిరికిరీలు పెడుతూ తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్‌ను యూటీ చేయాలని, ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను తూర్పు గోదావరి జిల్లాలో, నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణా పరిధిలోని 23 రెవెన్యూ గ్రామాలను కృష్ణాజిల్లాలో కలిపేలా సీమాంధ్ర నేతలు పావులు కదుపుతున్నారన్నారు. 1956కు పూర్వం మునగాల పరగణా ఆంధ్రా ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, భాష తెలంగాణలోనే మమేకమయ్యాయన్నారు. కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారని, ఆయనను సాగనంపేందుకు తెలంగాణవాదులు నడుం బిగించాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటులో టీడీపీ దొంగాట ఆడుతోందని విమర్శించారు. కాగా, తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నల్లగొండ టు మునగాల’ పాదయాత్రను నల్లగొండలో కోదండరాం ప్రారంభించారు.
జీవోఎం వాయిదాపై అనుమానాలు
మహబూబాబాద్ : కేంద్ర ప్రభుత్వం జీవోఎంను ఈనెల 27కు వాయిదా వేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో గురువారం తెలంగాణ మాలమహానాడు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. నదీ జలాలు, ఇతర వనరులు సీమాంధ్ర పాలకుల గుత్తాధిపత్యంలో తెలంగాణ నలిగిపోయిందన్నారు.
30న ముంబైలో తెలంగాణ సభ
హైదరాబాద్ : తెలంగాణ గడ్డపై పుట్టిన మమకారంతో ముంబైలో ఈనెల 30న ‘తెలంగాణ బిల్లు సాధన సభ’ను నిర్వహించడం అభినందనీయమని కోదండరాం అన్నారు. గురువారం సభకు సంబంధించిన కరపత్రాన్ని దళిత సంఘర్షణ సమితి రాష్ర్ట అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, కోదండరాం ఆవిష్కరించారు.