వరి ఊకతో గ్రీన్ వుడ్ | Rice waste makes ‘green wood’ to build low-cost homes in India | Sakshi
Sakshi News home page

వరి ఊకతో గ్రీన్ వుడ్

Published Sat, Apr 2 2016 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

వరి ఊకతో గ్రీన్ వుడ్

అమృత్సర్: సృజనాత్మకంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. ఆ పరిష్కారంలో కొత్త ఆవిష్కరణలు కూడా పుట్టుకొస్తాయి. అమృత్సర్‌కు చెందిన 15 ఏళ్ల బిస్మన్ డెయూ విషయంలోనూ అదే జరిగింది. బిస్మన్ ప్రతిరోజు సాయంత్రం తన తండ్రితో కలసి పొలానికి వాకింగ్‌కు వెళ్లేది. సమీప పొలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి దుబ్బను పోగేసి తగులబెట్టడం చూసేది. అందులో నుంచి వెలువడే దట్టమైన పొగ ఊపిరాడనిచ్చేది కాదు.

కాలుష్యానికి కూడా కారణమవుతున్న వరి దుబ్బను తగులబెట్టే సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనుకుంది. ఎలా దీనికి పరిష్కారం కనుగొనడం ఎలా? అంటూ ఆలోచిస్తూ పోయింది. ఓ రోజు వరి ఊకను చేతుల్లోకి తీసుకొని పరిశీలించింది. అందులో ఏ పదార్థం ఉంటుందో కనుక్కోవాలనుకుంది. తనకు తెలిసిన ప్రయోగాల ద్వారా అందులో వాటర్‌ప్రూఫ్‌గా పనిచేసే సిలికాన్ పదార్థం ఉన్నట్లు కనుగొన్నది. ఈ సిలికాన్ పదార్థానికి చెదలుపట్టే గుణం కూడా లేదని గ్రహించింది. వెంటనే వరి ఊకను ఇంటికి తీసుకెళ్లి వంటింటినే తన ప్రయోగశాలగా చేసుకొంది.

ఊకను జిగురుతో కలిపి ముద్దు చేసింది. దాన్ని పలక మాదిరిగాచేసి పొయ్యిపై వేడి చేసింది. ఆశ్చర్యంగా అది బలమైన చెక్క పలకగా మారిపోయింది. ఇలాంటి పలకలను పెద్ద ఎత్తున తయారుచేసి ఇంటి నిర్మాణంలో ఉపయోగించుకోవచ్చని గుర్తించింది. మరో ఇద్దరు స్నేహితురాళ్ల సహాయంలో మరిన్ని పలకలు తయారు చేసింది. ఆ పలకలకు ‘గ్రీన్ వుడ్’ అని పేరు కూడా పెట్టింది. హైస్కూల్ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించే 2013-సోషల్ ఇన్నోవేషన్ పోటీ’లకు వెళ్లింది. ఆక్కడ 42 వేల మంది విద్యార్థులతో పోటీ పడి తన గ్రీన్ వుడ్‌కు బహుమతి గెలుచుకుంది.

ఆ మరుసటి సంవత్సరం న్యూయార్క్‌లో జరిగిన ఓ చిల్డ్రన్ ఈవెంట్‌కు యూనిసెఫ్ ఆహ్వానాన్ని అందుకుంది. అక్కడ ఇన్నోవేటివ్ ఆలోచనలపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్నది. బిస్మన్‌కు ఇప్పుడు 18 ఏళ్లు. చండీగఢ్ స్కూల్లో చదువుకుంటోంది. తన గ్రీన్ ఉడ్‌ను మరింత పాపులర్ చేసేందుకు కృషి చేస్తోంది. తన గ్రీన్ ఉడ్‌ను మార్కెట్ పరంగా ఉత్పత్తి చేసి విక్రయించేందుకు దేశం నుంచే కాకుండా ఈక్వెడార్ నుంచి కూడా కంపెనీలు వస్తున్నాయని ఆమె చెబుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement