సీబీఐ కొత్త చీఫ్‌గా శుక్లా | Rishi Kumar Shukla appointed new CBI director | Sakshi
Sakshi News home page

సీబీఐ కొత్త చీఫ్‌గా శుక్లా

Published Sun, Feb 3 2019 4:00 AM | Last Updated on Sun, Feb 3 2019 11:18 AM

Rishi Kumar Shukla appointed new CBI director - Sakshi

రిషి కుమార్‌ శుక్లా

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) కొత్త చీఫ్‌గా మధ్యప్రదేశ్‌ మాజీ డీజీపీ రిషి కుమార్‌ శుక్లా(58)ను కేంద్రం ఎంపిక చేసింది. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంతో కీలకమైన సీబీఐ డైరెక్టర్‌ పదవిని భర్తీ చేయకుండా ఇంకా ఎంతకాలం ఖాళీగా ఉంచుతారని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన అత్యున్నత ఎంపిక కమిటీ జనవరి 24వ తేదీన భేటీ అయినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తిరిగి ఈ నెల ఒకటో తేదీన సమావేశమై అర్హులైన కొందరు అధికారుల పేర్లను పరిశీలించింది. వీరందరిలోనూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన అన్ని విధాలుగా అర్హుడైన ఆర్‌కే శుక్లాను సీబీఐ చీఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 1983 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన శుక్లా 2016 నుంచి ఈ ఏడాది జనవరి వరకు మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బదిలీ చేసింది. కాగా, శుక్లా ఈనెల 4వ తేదీన సీబీఐ చీఫ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ,, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం ఇద్దరినీ సెలవుపై పంపిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.   

ఖర్గే అసంతృప్తి
సీబీఐ చీఫ్‌గా రిషి కుమార్‌ శుక్లాను కేంద్రం ఎంపిక చేయడంపై కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి కేసుల విచారణలో ఏమాత్రం అనుభవం లేని శుక్లాను నియమించడం ఎంపిక ప్రక్రియను, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. శుక్లా నియామకంపై అసంతృప్తి తెలుపుతూ అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు అయిన ఖర్గే శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘అవినీతి వ్యతిరేక కేసుల విచారణలో అనుభవం లేని అధికారిని నియమించడం ద్వారా అత్యున్నత ఎంపిక కమిటీ నిబంధనలను అతిక్రమించడంతోపాటు సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పట్టించుకోలేదు.  కీలకమైన పోస్టులకు అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అవినీతి కేసుల దర్యాప్తులో అనుభవంతోపాటు సీబీఐలో పనిచేసిన అనుభవాన్ని పరిశీలించాలి’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

తప్పుదోవ పట్టించేందుకు ఖర్గే యత్నం
సీబీఐ చీఫ్‌ ఎంపిక ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ నేత, అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సభ్యుడైన మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆరోపించారు. తను సూచించిన వ్యక్తులకు సీబీఐలో స్థానం కల్పించేందుకు, అత్యున్నత స్థాయి సమావేశాల్లో జరిగిన పరిణామాలపై మీడియాకు తన సొంత భాష్యం చెప్పారని విమర్శించారు.

మధ్యప్రదేశ్‌ కేడర్‌ నుంచి తొలి అధికారి
మధ్యప్రదేశ్‌ కేడర్‌ నుంచి సీబీఐ డైరెక్టర్‌ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆర్‌కే శుక్లా చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆర్‌కే శుక్లా ఫిలాసఫీలో పీజీ చేశారు. జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ అనంతరం రాయ్‌పూర్, దామోహ్, శివ్‌పురి, మంద్‌సౌర్‌ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యప్రదేశ్‌ డీజీపీగా ఆయన దాదాపు రెండున్నరేళ్లు పనిచేశారు. డీజీపీగా.. లైంగిక దాడి కేసులపై త్వరితంగా విచారణ చేపట్టి, శిక్షలు పడేలా చేయడం ద్వారా రాష్ట్రంలో అటువంటి ఘటనల సంఖ్యను గణనీయంగా తగ్గించ గలిగారు. ఆయనకు సీబీఐలో పనిచేయకున్నా ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో పలు సున్నితమైన కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. బందీలపై సంప్రదింపుల ప్రక్రియ, సంక్షోభ నిర్వహణ వంటి వివిధ అంశాలపై అమెరికా, బ్రిటన్‌లలో శిక్షణ పొందారు. సీబీఐ పలు వివాదాలతో రచ్చకెక్కిన సమయంలో శుక్లా బాధ్యతలు చేపట్టనుండటంతో అందరి దృష్టీ ఆయనపైనే పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement