పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కరోనా భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందించిన వైద్యుడే లాలూ ప్రసాద్‌కు కూడా చికిత్స చేయడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇదే హాస్పిటల్‌లో లాలూ కూడా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత మూడు వారాలుగా లాలూకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్‌ప్రసాద్ కరోనా బాధితుడికి కూడా వైద్యం చేశారు. దీంతో కోవిడ్ రోగికి వైద్యం అందించిన ఉమేష్‌ప్రసాద్‌తో పాటు, అతని బృందంలోని అందరినీ క్వారంటైన్‌కు పంపుతున్నట్లు రిమ్స్ ప్రకటించింది. అంతేకాకుండా వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్‌కి కూడా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే లాలూను పెరోల్ పై విడుదల చేసే ప్రతిపాదనను జార్ఖండ్ అడ్వకేట్ జనరల్‌కు సీఎం హేమంత్ సోరెన్ పంపించారు. కాగా 7 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న ఖైదీలను మాత్రమే పెరోల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. (లాలూ ప్రసాద్‌కు అనారోగ్యం)
Comments
Please login to add a commentAdd a comment