ఆర్జేడీకి 16.. జేడీయూకు 15..!
పట్నా: బిహార్లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మహాకూటమి ప్రభుత్వంలో ఆర్జేడీకి 16, జేడీయూకు 15, కాంగ్రెస్కు 5 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ఈ నెల 20న జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో మహాకూటమి ప్రభుత్వం కొలువుదీరనున్నట్టు సమాచారం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై నితీశ్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం మహాకూటమిలోని పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు సమావేశమై మహాకూటమి శాసనసభ పక్ష నాయకుడిగా నితీశ్ను ఎన్నుకుంటారు. ఈ రోజు ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఇప్పటికే మంత్రుల జాబితా తయారు చేసినట్టు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో లాలు ప్రసాద్ కుమారులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్లు గెలుపొందారు. వీరికి కేబినెట్ బెర్తులు లభిస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.