నాటి కింగ్.. నేడు కింగ్ మేకర్ గా..
పట్నా: ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ మరోసారి తన సత్తా చాటారు. బరిలో దిగకుండానే చక్రం తిప్పారు. బిహార్ లో తన మార్కు ఏమాత్రం చెరిగిపోలేదని నిరూపించారు. ఒకప్పుడు కింగ్ గా ఉన్న ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండానే తన ఇద్దరు కుమారులను బరిలోకి దింపి కింగ్ మేకర్ అనిపించుకున్నారు. మహాకూటమి విజయానికి కీలక బాటలు వేసి తన పార్టీని మరోసారి బిహార్ లో అతిపెద్ద పార్టీగా నిలిపారు. దాణా కుంభకోణం కేసులో ఇరుక్కున్న తర్వాత లాలు ప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త ఎడం పాటించిన విషయం తెలిసిందే.
దాదాపు పదేళ్లపాటు ఆయన నిగూఢంగా కనిపించారు. అంతా లాలు చరిష్మా తగ్గిపోయినట్లేనని అనుకున్నారు. కానీ మరోసారి మహాకూటమిగా ప్రజల ముందుకు వచ్చి బీజేపీని మట్టికరిపించారు. ఆయనకు విశ్వాసం ఎంత ఎక్కువంటే ఆదివారం ఎన్నికల ఫలితాలు తెలియకముందే, కౌంటింగ్ ప్రారంభం కాకముందే నిద్రలో నుంచి మేల్కొని 'అందరికీ శుభోదయం.. నాకు గత రాత్రి చాలా హాయిగా నిద్ర పట్టింది.. బహుశా మీకు పట్టి ఉండదు. అది నేను గమనించాను(పత్రికా విలేకరులను ఉద్దేశించి). మేము గెలుస్తున్నాం. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు' అని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రారంభంలో బీజేపీ గంటపాటు లీడింగ్ లో కనిపిస్తుండగా లాలు చెప్పిన మాటలు నీటి మూటలవుతాయేమోనన్న అనుమానం కలిగింది. ఆ సమయంలో కూడా 'మీరు చూస్తూ ఉండండి మరో గంటలో ఫలితాలు తారుమారవుతాయి. మాకు 145 స్థానాలు రావడం ఖాయం. మహాకూటమిని విజయం పలకరిస్తుంది. నా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన నితీష్ కుమార్ మాత్రమే ముఖ్యమంత్రి' అని ప్రకటించారు. ఆయన అలా చెప్పిన మరికాసేపట్లోనే నిజంగానే మహాకూటమి ఫలితాల విషయంలో పైకి ఎగబాకింది. దాదాపు 160 స్థానాల్లో లీడ్ లో ఉంది. వీటిలో ఆర్జేడీ 75 స్థానాల్లో, అధికార జేడీయూ 65, కాంగ్రెస్ 19 స్థానాల్లో లీడ్లోకి వచ్చాయి. దీంతో మరోసారి లాలు రాజకీయాల్లో కింగ్ మాత్రమే కాదు.. కింగ్ మేకర్ అని కూడా ఈ ఎన్నికలతో నిర్ధారణ అయింది.