కూటమిలోనూ లాలుదే పై చేయి!
ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో.. మొత్తం 243 నియోజకవర్గాలున్న బిహార్ అసెంబ్లీలో లాలు ప్రసాద్ సొంత పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ గెలుచుకున్న సీట్లు కేవలం 22. అప్పట్లో బీజేపీ 91 స్థానాలు, దాని మిత్రపక్షం జేడీయూ 115 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు పార్టీలు విడిపోయాయి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్లీ జరిగిన ఎన్నికల్లో మాత్రం జేడీయూ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి జట్టుకట్టిన లాలు.. ఈసారి భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. కూటమి మొత్తం ఆధిక్యంలో ఉన్నా.. విడిగా కూటమి పార్టీలన్నింటిలోకీ ఆర్జేడీ ముందంజలో కనిపిస్తోంది.
స్వయంగా తను అసెంబ్లీ బరిలో దిగని లాలు.. తన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లను పోటీలో నిలిపారు. అన్నదమ్ములిద్దరూ కూడా తమ తమ స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్లలో వాళ్లు తమ ప్రత్యర్థుల కంటే కాస్త వెనుకంజలో ఉన్నా.. తర్వాత పుంజుకున్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, తన తమ్ముడు నితీష్ కుమారే సీఎం అవుతారని చెబుతూ వచ్చారు. ఎన్నికల ఫలితాల మీద కూడా ఆయన గతంలో ఎన్నడూ లేనంత ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత తాను దేశం మొత్తం తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని కూడా లాలు రెండు రోజుల ముందే చెప్పారు.