
డాక్టర్లతో సమానంగా రోబోలు!
న్యూఢిల్లీ: రోగులకు చికిత్స అందించడంలో ఇటీవలి కాలంలో యంత్రాల ఉపయోగం విస్తృతంగా పెరిగిపోతోంది. రోబోలు డాక్టర్లతో సమానంగా శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. కొన్ని సార్లు డాక్టర్‌లు చేసే శస్త్రచికిత్సల కన్నా రోబోలు చేసే శస్త్రచికిత్సలే మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తాజాగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశీలనలో తేలింది.
ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడిన వారిపై నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం స్పష్టమైంది. ప్రోస్టేట్ గ్రంధిని తొలగించడానికి డాక్టర్లు నిర్వహించిన ఓపెన్ సర్జరీల్లో రోగులు ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండాల్సి రావటంతో పాటు.. సర్జరీ అనంతరం వారం రోజుల వరకు తమ రోజువారి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడినట్లు తేలింది. అయితే రోబోలతో నిర్వహించిన సర్జరీలో మాత్రం డాక్టర్లు చేసిన సర్జరీతో పోలిస్తే తక్కువ రక్తం నష్టపోవడంతో పాటు త్వరగా కోలుకుంటున్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. ప్రొస్టేట్, సర్వికల్, కిడ్నీ, లంగ్ క్యాన్సర్ల చికిత్సలో రోబోలను విరివిగా ఉపయోగిస్తున్నారు.