రాకెట్ కబుర్లు తెస్తుంది..!
రవాణా వ్యవస్థ ప్రారంభమైనప్పుడే పోస్టల్ వ్యవస్థ చరిత్ర కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఉత్తరాలను ఒక చోటు నుంచి మరో చోటుకు ఎలా చేరవేసేవారంటే.. ఆ ఏముంది.. రైలులోనో.. బస్సులోనో.. అంటారు కదా.. మరీ దూరమైతే విమానాల ద్వారా కూడా చేరవేసేవారు. ఇప్పుడైతే వాటి అవసరమే లేకుండా పోయిందనుకోండి. మన తాతల తరం వారికి ఏ చిన్న సమాచారం చేరవేయాలన్నా.. ఈ ఉత్తరాలే అన్నింటికీ ఆధారం. అప్పట్లో ఒక్క ఉత్తరం చేరాల్సిన చోటుకు చేరాలంటే వారాలకు వారాల సమయం పట్టేది.. అయితే త్వరగా పంపాలంటే ఎలా.. అందుకోసం రాకెట్లను వాడేవారట. రాకెట్ ద్వారా పోస్ట్ ఎలా పంపిస్తారని ఆశ్చర్యపోకండి.. నిజంగా రాకెట్ ద్వారానే ఉత్తరాలు పంపేవారట.
1810లోనే ఆలోచన..
రాకెట్ ద్వారా పోస్టు పంపాలన్న ఆలోచనకు 1810లోనే బీజం పడింది. అప్పట్లో హెన్రిచ్ వోన్ క్లీస్ట్ అనే రచయిత రాకెట్ ద్వారా ఉత్తరాలు పంపే ఆలోచనను వ్యాసం రూపంలో ఓ పత్రికలో రాశారు. జర్మనీలోని బెర్లిన్ నుంచి బ్రెస్లూ (180 మైళ్లు)కు సగం దినంలో పంపొచ్చని ఆయన అంచనా వేశారు. అంటే గుర్రం ద్వారా పట్టే సమయంలో పదో వంతన్న మాట. ఆయన సిద్ధాంతాన్ని టోంగాలోని పాలినేసియన్ అనే చిన్న ద్వీపంలో బ్రిటిష్ పరిశోధకుడు సర్ విలియమ్ కంగ్రీవ్ ఆచరణలో పెట్టారు. అయితే అది సక్సెస్ అవలేదు. మరో వందేళ్ల వరకు దీని గురించి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 1927లో హెర్మన్ జులియస్ అనే జర్మన్ ఫిజిసిస్ట్ దీనిపై ప్రయోగాలు చేశారు. 1928లో యువ ఇంజనీరైన ఫ్రెడ్రిక్ స్క్మీడిల్ ఉత్తరాలను రాకెట్ ద్వారా పంపేందుకు ప్రయత్నించారు. చివరికి 1931లో చరిత్రలోనే తొలిసారిగా రాకెట్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి 102 ఉత్తరాలను ఒకేసారి పంపి చరిత్రలోకెక్కారు. కిందికి దింపేందుకు పారాచూట్‌లను వాడేవారు.
భారత్‌లో తొలి రాకెట్ ఉత్తరం!
ఆ తర్వాత వేరే దేశాల్లో కూడా ఈ ప్రయోగాలు జరిగాయి. 1934లో భారత్‌లో దీనిపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఎయిరోస్పేస్ ఇంజనీర్ స్టీఫెన్ స్మిత్ విజయవంతంగా ఈ రాకెట్ ద్వారా ఉత్తరాలను పంపారు. 1934 నుంచి 1944 మధ్య దాదాపు 270 సార్లు ప్రయోగించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఆహారం అందించేందుకు స్మిత్ ప్రపంచలోనే తొలిసారిగా రాకెట్‌ను ఉపయోగించారు.
ఖర్చు చాలా ఎక్కువే..
అయితే రాకెట్ ద్వారా ఉత్తరాలు బట్వాడా చేయాలంటే అంత సులువేం కాదు.. ఇందుకోసం చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఈ ప్రయోగానికి అప్పట్లోనే 10 లక్షల డాలర్లు ఖర్చయ్యేదట. కానీ బట్వాడా చేయడం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 240 డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment