Seema Haider Fallout, Rocket Launcher Attack on Hindu Temple - Sakshi
Sakshi News home page

సీమాను పాక్‌ పంపాలంటూ హిందూ దేవాలయంపై దాడి

Published Sun, Jul 23 2023 7:34 AM | Last Updated on Sun, Jul 23 2023 5:54 PM

seema haider fallout rocket launcher attack on hindu temple - Sakshi

పాకిస్తాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌కు చెందిన సింధ్‌లోని ఒక హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. సింధ్‌లోని కాష్మోర్ జిల్లాలో స్థానిక హిందూ సంఘాలు నిర్మించిన ఒక దేవాలయంపై దాడి చేయడానికి దుండగులు రాకెట్ లాంచర్‌ను ఉపయోగించారు. అలాగే మైనారిటీ హిందూ కమ్యూనిటీ సభ్యుల ఇళ్లపై వారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కాష్మోర్-కంద్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) ఇర్ఫాన్ సమ్మో నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది.

రాకెట్ లాంచర్‌తో దాడి
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం బగ్రీ కమ్యూనిటీ వార్షిక మతపరమైన సేవల కోసం తెరిచిన ఆలయంపై దుండగులు రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది. కాగా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునేంతలో దాడికి పాల్పడినవారు అప్పటికే పారిపోయారు. ఈ దాడిలో  8-9 మంది సాయుధ దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. బగ్రీ వర్గానికి చెందిన డాక్టర్ సురేష్ మాట్లాడుతూ దుండగులు ప్రయోగించిన రాకెట్‌ వల్ల ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతవాసులు భయంతో కాలం గడుపుతున్నారు.

సీమా హైదర్‌ను తిరిగి పాకిస్తాన్‌ పంపించకపోతే ఇలానే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తామని ఆ దుండగులు బెదిరించారు. 2019లో పాక్‌కు చెందిన సీమా ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ, హిందూ వ్యక్తిని ప్రేమించానంటూ, తన నలుగురు పిల్లలతో సహా భారతదేశానికి వచ్చింది. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు సీమాను గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆమె ప్రేమికుడు సచిన్ ఆ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అక్రమ వలసదారునికి ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే అతను ఇటీవలే విడుదలయ్యాడు.

హిందూ సభ్యుల కిడ్నాప్‌
కాష్మోర్, ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణించడంపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీపీ) ఆందోళన వ్యక్తం చేసింది.  హిందూ సమాజానికి చెందిన 30 మంది సభ్యులను వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ చేశాయని హెచ్‌ఆర్‌సీపీ పేర్కొంది. ఈ ముఠాలు అధునాతన ఆయుధాలను ఉపయోగించి హిందూ ప్రార్థనా స్థలాలపై దాడి చేస్తామని బెదిరించినట్లు తమకు సమాచారం అందిందని వివరించింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని సింధ్ హోం శాఖను కమిషన్ కోరింది. కరాచీ అనేక పురాతన హిందూ దేవాలయాలకు నిలయంగా ఉంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందూ కమ్యూనిటీ సభ్యులు అధికంగా ఉన్నారు. 
ఇది కూడా చదవండి: నేపాల్‌లో చైనా ‘పెంగ్‌’.. భారత్‌లోకి చొరబడుతూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement