మన్‌కీ బాత్‌లో మోదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ గురించి మాట్లాడకపోవటంపై..
న్యూఢిల్లీ: మన్‌కీ బాత్‌లో మోదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ గురించి మాట్లాడకపోవటంపై.. కాంగ్రెస్ మండిపడింది. ‘ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యతో దేశమంతా అట్టుడికిపోతే.. ప్రధాని కనీసం ఒక మాటైనామాట్లాడరా?’ అని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు ఇరానీ, దత్తాత్రేయలపై ఇంతవరకు మోదీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విచారకరమన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగే అవకాశాలు కన్పించడం లేదని,ఇందుకు ప్రధానమంత్రి మోదీ వైఖరే కారణమని ఆదివారం ఆరోపించారు.
చర్చలతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, అయితే మోదీ ప్రతిపక్షంతో ఘర్షణ వైఖరినే అవలంబిస్తున్నారనీ, ఆయనదంతా ఏకపక్ష వైఖరని దుయ్యబట్టారు. ఈ పెడధోరణుల వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. ఆయన తన ఇరవై నెలల పాలనా కాలంలో ఏ అంశంలోనూ ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదన్నారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య రీతులకు భంగకరమన్నారు. ఇవన్నీ సిన్హా వ్యాఖ్యలతో ధ్రువపడిందన్నారు.