సోదరికి టాయిలెట్ గిప్ట్ గా ఇచ్చాడు..
రాంచీ: రక్షాబంధన్ రోజున తన సోదరికి ఓ అన్న అరుదైన కానుక ఇచ్చాడు. సాధారణంగా రాఖీ కడితే సోదరులు... అక్కా లేదా చెల్లెళ్లకు చీర లేక నగదు రూపంలో బహుమతి ఇస్తుంటారు. అయితే జార్ఖండ్లోని రాంగఢ్కు చెందిన పింటూ అనే యువకుడు మాత్రం తన సోదరికి మరుగుదొడ్డిని నిర్మించి గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపకల్పన చేసిన స్వచ్ఛ భారత్ ద్వారా స్ఫూర్తి పొందిన అతడు ఈ పనికి పూనుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్లడం అనేది ఎంతో ఇబ్బందో తనకు తెలుసునని, అది ఆరోగ్యానికి మంచిది కాదని పింటూ పేర్కొన్నాడు.
దీంతో మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు అతడు తెలిపాడు. 'నేను రక్షా బంధన్ సందర్భంగా నా సోదరికి టాయిలెట్ బహుమతిగా అందించాను. ఇతరులు కూడా దీన్ని అనుసరిస్తే బాగుంటుంది' అని సూచన చేశాడు. ఈ నిర్ణయంతో తన సోదరి కూడా సంతోషంగా ఉందని పింటూ తెలిపాడు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందన్నట్లు పింటూ ఆలోచనతో ...ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే.