
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల టికెట్లను రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్) సిబ్బంది ఇకపై తనిఖీ చేయరాదని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ధర్మేంద్ర కుమార్ ఆదేశించారు. ఇటీవల టికెట్ లేకుండా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీల నుంచి తప్పించుకునేందుకు యత్నించి దుర్మరణం చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు అన్ని రైల్వే జోనల్ కార్యాలయాలకు కుమార్ లేఖ రాశారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పర్యవేక్షణాధికారిని ఇందుకు బాధ్యునిగా చేస్తామని హెచ్చరించారు. రైల్వే చట్టం ప్రకారం టికెట్ల తనిఖీతో పాటు అదనపు చార్జీలు విధించడం టికెట్ తనిఖీ బృందాలకు సంబంధించిన విషయమని కుమార్ స్పష్టం చేశారు.