తెలంగాణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది…పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతూంటే… ఓటరు మహాశయుడూ నవంబరు 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాడు. తొలిసారి ఓటేస్తున్నామన్న ఉత్సాహం యువ ఓటర్లది.... నచ్చని నేతలను వదిలించుకోవాలని ఇతరులు ఎదురు చూస్తున్నారు. మరి… ఓటరు జాబితాలో మీ పేరుందో? లేదో చూసుకున్నారా? దాంట్లో తప్పులేమీ లేవు కదా? ఉంటే సరిచేసుకోవడం ఎలా అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు… సాక్షి.కాం మీతోనే ఉంది.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా మీ ఓటరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? పేరెలా పరిశీలించాలి? మొబైల్ఫోన్కు ఆధార్ నెంబరును లింక్ చేసుకోవడమెలా వంటి అనేక సందేహాలకు సమాధానాలు అందిస్తోంది. ఆలస్యం ఎందుకు…. చదివేయండి. మీ సందేహాలు తీర్చుకోండి.
ఇంకా ఏవైనా మిగిలిన ఉంటే ఎన్నికల కమిషన్ అధికారులతోనే మీ డౌట్స్ క్లియర్ చేసేందుకూ ప్రయత్నిస్తాం. మీరు చేయాల్సిందల్లా… మీ సందేహం/సమస్యను vote@sakshi.com ఐడీకి మెయిల్ చేయడమే!!
ఓటర్ల సమాచారాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఓటర్లకు సంబంధించిన అన్ని సేవలను, సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చి https://voterportal.eci.gov.in ను రూపొందించింది. ఓటరుగా నమోదు చేసుకోవడం మొదలుకొని జాబితాలో పేరును చెక్ చేసుకోవడం వరకూ అన్ని సేవలూ ఇక్కడే లభిస్తాయి.
జాబితాలో మీ పేరు చూసుకోండిలా…
ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించగానే… కుడివైపున సర్వీసెస్ అన్న భాగంలో ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని ఒక చిన్న ట్యాబ్‌ను గమనించండి. దాన్ని క్లిక్ చేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఇలా ఉంటుంది…. ఇందులో మూడు రకాలుగా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. మొదటది మీ వివరాలను అందించడం. రెండోది మీ ఓటర్ ఐడీ సంఖ్య ద్వారా… మూడోది మొబైల్ నెంబరు ద్వారా (ఓటరు ఐడీకి మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేసి ఉంటేనే) వివరాలిచ్చి ఇలా…. ఓటర్ ఐడీలో ఉన్నట్టుగానే మీ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంటిపేరైనా ఇవ్వవచ్చు.
లేదంటే… ఓటరు ఐడీలో మీరు ఇచ్చి తల్లి/తండ్రి లేదా ఇతర బంధువు పేరు వివరాలు ఇచ్చి కూడా వెతకవచ్చు. నమోదు చేసుకున్న పుట్టినరోజు లేదా మీ వయసు వివరాలు ఇచ్చి కూడా జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఇవేవీ లేకుంటే స్త్రీ, పురుషుడు లేదా థర్డ్ జెండర్ అన్న వివరాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కానీ… కొంచెం వ్యయ ప్రయాసతో కూడుకున్న పని.
చివరగా.. మీ జిల్లా, మీ నియోజకవర్గం వివరాలు ఇవ్వడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
పేజీ చివర ఉన్న Captcha Code బాక్స్‌లోఉన్న అక్షరాలు లేదా అంకెలను రాసి సెర్చ్ బటన్ నొక్కితే మీ వివరాలు కనిపిస్తాయి.
నోట్: పేర్లు, ఇతర వివరాలు టైప్ చేసేటప్పుడు పెద్ద, చిన్న అక్షరాలు, పదాల మధ్య ఖాళీలు సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పేజీ పై భాగంలోనే మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయడం మరచిపోవద్దు. అలాగే తెలుగుతోపాటు దాదాపు 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని వెతకవచ్చునని గుర్తించండి.
ఓటర్ ఐడీ ద్వారా…
మీ ఓటర్ ఐడీలోని సంఖ్య ద్వారా జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులువు. పైన కనిపిస్తున్న మాదిరిగా ఉంటుంది వెబ్‌సైట్‌లోని స్క్రీన్. ఒక పక్కన ఓటర్ ఐడీ సంఖ్యను ఎంటర్ చేయాలి. రెండోవైపున ఉన్న కాలమ్ నుంచి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత Captcha Code ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సరి.
మొబైల్ ఫోన్ ద్వారా…
రాష్ట్రం, భాషలను ఎంచుకున్న తరువాత స్క్రీన్ మధ్యలో ఉన్న కాలమ్‌లో ఓటర్ ఐడీకి అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబరును ఎంటర్ చేయాలి. ఎన్నికల కమిషన్ పంపే ఓటీపీని దిగువనే ఉన్న కాలమ్లో టైప్ చేసి Captcha Code కూడా ఎంటర్ చేయాలి. దీని తరువాత సెర్చ్ కొడితే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే…
ముందుగా https://voterportal.eci.gov.in కు వెళ్లండి. సర్వీసెస్ భాగంలో దిగువన ‘ఈ-ఎపిక్ డౌన్‌లోడ్’ అని ఉన్న కాలమ్పై క్లిక్ చేయండి. ఇలా ఒక స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. భారతీయ ఓటరు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లు తమకు సంబంధించిన కాలమ్స్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. రిజస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపిని ఎంటర్ చేసి ఓటర్ ఐడీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఏ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయాలో తెలుసుకోవాలంటే… హోమ్ పేజీలో సర్వీసెస్ భాగంలో ‘నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ ఆఫీసర్’ అన్న కాలమ్‌ను క్లిక్ చేయండి. ఓటర్ ఐడీ సంఖ్య, Captcha Code లు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
చివరగా…
ఓటర్ ఐడీలో మీ వివరాలు మార్చుకోవాలనుకుంటే https://voterportal.eci.gov.in హోమ్ పేజీలోనే ఫామ్స్ అన్న భాగంలో అవసరమైన పత్రాలు ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి మార్పులు చేర్పులు, అభ్యంతరాలు, తొలగింపుల వంటివి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment