సాక్షి, హైదరాబాద్: అక్కడక్కడ పార్టీల కార్యకర్తల ఘర్షణ మినహాయించి.. దాదాపుగా తెలంగాణ అంతటా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాజధాని హైదరాబాద్‌లో మాత్రం మందకొడిగా పోలింగ్ నమోదు అవుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటర్లు ఓటేయమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో.. తమకు అభివృద్ధి పనులు కావాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
పోలింగ్ బహిష్కరణ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్ ను బహిష్కరించారు గిరిజన గ్రామస్తులు. తమ గ్రామం లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును భహిష్కరించిన గిరిజన గ్రామస్తులు..
అలాగే.. వైరా నియోజకవర్గంలోని రెండు చోట్ల గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో రహదారులు ,త్రాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు 20 ఏళ్లుగా ఏర్పాటు చేయలేదని గిరిజనులు నిరసన తెలుపుతున్నారు. తమ సమస్య పరిష్కరించేంతవరకు ఓటు వేయమని వాళ్లు అంటుడగా.. అధికారులు మాత్రం వాళ్లను బతిమాలుతున్నారు.
ఏన్కూరు మండలం రాజుల పాలెం గ్రామంలోనూ ఇదే సీన్ కనిపించింది. రాజుల పాలెం గ్రామం నుండి శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మించాలనే డిమాండ్ నెరవేరకపోవడంతో ఓటేయమని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
డబ్బిస్తేనే ఓటేస్తాం!
మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం ఓటర్లు డిమాండ్ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు ‘డబ్బులు ఇస్తేనే.. ఓటు వేస్తాం’ అంటూ తేల్చిశారు ఓటర్లు. దీంతో ఓటేయాలంటూ అధికారులు బతిమాలుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఓటు పోల్ కాలేదు.
రోడ్డు కావలెను
అదిలాబాద్ బజార్ హత్నుర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేంత వరకు ఓట్లు వేయమని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకుని గ్రామానికి బయలుదేరిన అధికారులు, వాళ్లతో చర్చలు జరుపుతున్నారు.
ఓటర్లు లేక వెలవెల
తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉదయం 11గంటల వరకూ కేవలం 20 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment