
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్(ఫైల్ ఫోటో)
న్యూయార్క్ : ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన మూలాలని, ఆధ్యాత్మికతని మర్చిపోవడం వల్లే ఇంత వెనకబడి ఉన్నాం’ అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. శుక్రవారం చికాగోలో నిర్వహించిన రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనకు తెలివి ఉంది.. జ్ఞానం ఉంది.. కానీ ఐకమత్యం లేదు. అందువల్లే మనం ఇంత వెనకబడి ఉన్నాం. మన హిందూ సమాజంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. కానీ వారందరికి సరైన గుర్తింపు లేదు. సింహాలు కలిసి సంచరించవు.. కానీ అడవి కుక్కలు కలిసి దాడి చేస్తాయి.. నాశనం చేస్తాయి’ అని తెలిపారు. అంతేకాక హిందువుల్లో ఐకమత్యం లోపించిందని ఆయన వాపోయారు. హిందూవులందరిని ఒక్క తాటిపైకి తీసుకురావడం కూడా చాలా కష్టమన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2500 మంది హాజరయ్యారు. వీరిలో బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు.