ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై అధికార శివసేన మండిపడింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ వ్యవహరించిన తీరును అధికార శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస్ ఆఘాడి’ ప్రభుత్వం కీలకమైన బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంటే ఫడ్నవీస్ అడ్డుపడుతున్నాడని శివసేన దుయ్యబట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయుకుడిలా ఫడ్నవీస్ ప్రవర్తించడం లేదని విమర్శించింది. ‘ప్రతిపక్షనాయకుడు తన జ్ఞానంతో శ్రద్ధగా ఉంటే, అధికారులు సైతం పలు విషయాల్లో అతన్ని సంప్రదిస్తారు. కానీ ఫడ్నవీస్‌కు అసలు జ్ఞానం లేదు’ అని శివసేన ఎద్దేవా చేసింది. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం నుంచి ఫడ్నవీస్ పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికింది.
అదే విధంగా.. ‘శివసేన కూటమి ప్రభుత్వంలో ఎటువంటి మనస్పర్థలు లేవు. ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడపడానికి కృషి చేస్తున్నారు’ అని శివసేన పేర్కొంది. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ అనవసరపు విమర్శలు చేస్తోందని మండిపడింది. 80 గంటలపాటు సీఎంగా ఉన్న ఫడ్నవీస్.. కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీల నుంచి ఒక్క ఎమ్మెల్యేను కూడా విడదీయలేకపోయారని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
కాగా ఇటీవల రాష్ట్ర వ్యవహారాలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక బంగ్లాలో నిర్వహించిన సమావేశానికి ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ హాజరుకాలేదు. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చ జరిగితే.. సమావేశానికి హాజరుకాకుండా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావడంలో అర్థం లేదు. కూటమిలోని పార్టీల మధ్య అంతర్గతంగా సఖ్యత లేదు’ అని ఫడ్నవీస్ విమర్శించారు. (శివసేన కోరితే.. మద్దతు ఇస్తాం: బీజేపీ)
Comments
Please login to add a commentAdd a comment