నేనే సమాజ్‌వాదీ చీఫ్
అఖిలేశ్ కేవలం సీఎం.. శివపాల్ రాష్ట్ర అధ్యక్షుడు
♦ తేల్చి చెప్పిన ములాయం సింగ్ యాదవ్
♦ ఈ నెల 17 లోపే తేలకపోతే ‘గుర్తు’ స్తంభించే అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పార్టీకి తానే జాతీయ అధ్యక్షుడినని ములాయం సింగ్ యాదవ్ ఆదివారం స్పష్టంచేశారు. తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి మాత్రమేనని, సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని కూడా ములాయం పేర్కొన్నారు. అఖిలేశ్ మద్దతుదారుడైన రాంగోపాల్ యాదవ్‌పై ములాయం మండిపడ్డారు. ‘డిసెంబర్ 30నే రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాం. జనవరి 1న ఏ హోదాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఆయన (రాంగోపాల్) నిర్వహిస్తారు?’ అని ప్రశ్నించారు.
ఈ మీడియా సమావేశంలో పార్టీ నేతలు అమర్‌సింగ్, శివపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలోని వైరివర్గాలకు ఎన్నికల గుర్తు ‘సైకిల్’పై తమ వాదనలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువుకు ఒకరోజు ముందు ములాయం ఈ మేరకు తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించడంపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా విలేకరుల ప్రశ్నలకు పూర్తిగా, ఓపికగా సమాధానాలిచ్చే ములా యం.. ఆదివారం సమావేశంలోమాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. మీడియా ప్రతినిధులపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అఖిలేశ్‌కు మద్దతుగా ఎందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినా చెల్లవన్నారు. కాగా, అమర్ సింగ్‌కు జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది.
రాజీ మాటే లేదు: రాంగోపాల్
అయితే ఇరు వర్గాల మధ్య రాజీ జరుగుతోందంటూ వచ్చిన వార్తలను రాంగోపాల్ యాదవ్ ఖండించారు. కొందరు నేతాజీని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ములాయంను పార్టీ మార్గదర్శకుడిగా, అఖిలేశ్‌ను అధ్యక్షుడిగా పార్టీ జాతీయ కార్యవర్గం ఎన్నుకుందని గుర్తుచేశారు. కాగా, ఢిల్లీ బయలుదేరేముం దు లక్నోలో పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం.. ‘అఖిలేశ్‌కు మెజారిటీ సభ్యుల మద్దతుంది. అయితేనేం. అఖిలేశ్ నా కుమారుడేగా’ అని వ్యాఖ్యానించినట్లు తెలి సింది. కాగా, ఈనెల 17లోగా పార్టీ గుర్తు సైకిల్‌పై ఈసీ నిర్ణయానికి రాలేని పక్షంలో ఆ గుర్తును స్తంభింపజేసే అవకాశాలున్నాయి.