ముంబై: గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రతను తొలగించటంపై శివసేన పార్టీ మండిపడింది. కేంద్ర సర్కారు గాంధీ కుటుంబ భద్రతపై వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కథనం వెలువరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర.. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణంలో జరగాలని పేర్కొంది. గాంధీ కుంటుంబీకుల జీవితాలతో ఆటలు ఆడొద్దని ధ్వజమెత్తింది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు తమకు భద్రత కలింగించే రక్షణ సిబ్బంది లేకుండా ఉండలేరు. అంటే భద్రతకు ఎంత ప్రముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని సామ్నా పేర్కొంది. అటువంటి భద్రత గాంధీ కుంటుంబానికి తొలగించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని స్పందించాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖలో ఇటువంటి నిర్ణయం ఎవరు.. ఎలా తీసుకుంటారని సామ్నా తన సంపాదకీయంలో ప్రశ్నించింది. గాంధీ కుటుంబానికి చెందినవారు కాకుండా ఆ స్థానంలో వేరే వాళ్లు ఉంటే. కేంద్రం ఇదే తరహాలో నిర్ణయం తీసుకుంటుందా.. అని సామ్నా తన సంపాదకీయంలో నిలదీసింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. కాగా గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసిన విషయం తేలిసిందే. ఇక దాదాపు 28 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను.. వారికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇకపై రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రతకై ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులను వినియోగించనుంది. కాగా 1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు.
చదవండి: మీ అందరికీ ధన్యవాదాలు: రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment