spg security
-
భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్న సందర్భంగా ఎస్పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్పీజీ డీఐజీ నవనీత్‌కుమార్ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను పూర్తి స్తాయిలో సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పనిచేయనుంది. ఎస్పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు. ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో పూజా కార్యక్రమాల్లో దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను తీసుకొచ్చారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సమరోత్సాహ భక్తి ‘స్వీయ చిత్రం’ సమతామూర్తి సమారోహ వేదికలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి వచ్చిన మహిళలు వీరు.. యాగశాల వద్ద నరసింహస్వామి అవతారంలో ఓ వ్యక్తి తిరుగుతుండడంతో కొందరు వలంటీర్లు ఆయనకు దండం పెడుతుండగా.. మరికొందరు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (క్లిక్: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి) యాగశాలకు చేరుకున్న ఛత్రీలు.. యాగశాల వద్దకు బుధవారం కూడా వరుసగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఛత్రీలు చేరుకున్నాయి.. వాటిని తయారు చేసిన కార్మికులు కొందరు యాగశాల వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. (చదవండి: వెయ్యేళ్ల సమతాస్ఫూర్తి.. రామానుజ సమతా కేంద్రం నిర్మాణం..) టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర సమతా కేంద్రంలో బుధవారం ఉదయం తొలిరోజు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ చంద్ర, జై హనుమాన్ నినాదాలతో వేలాది మంది భక్తులు, పండితులు పాల్గొన్న ఈ యాత్ర కనుల పండుగగా సాగింది. ఈ యాత్రకు త్రిదండి చిన జీయర్‌స్వామి సారథ్యం వహించారు. వందలాదిగా రుత్వికులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఏడుగురు పూజ్య జీయర్లను అనుసరించారు. భక్తుల భజనలకు తోడుగా కోలాట నృత్యాలు ఆహ్లాదపరిచాయి. అనంతరం వాస్తు పూజ, పుణ్యహవచనం జరిగాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘వారి జీవితాలతో ఆటలు ఆడొద్దు’
ముంబై: గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రతను తొలగించటంపై శివసేన పార్టీ మండిపడింది. కేంద్ర సర్కారు గాంధీ కుటుంబ భద్రతపై వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కథనం వెలువరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర.. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణంలో జరగాలని పేర్కొంది. గాంధీ కుంటుంబీకుల జీవితాలతో ఆటలు ఆడొద్దని ధ్వజమెత్తింది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు తమకు భద్రత కలింగించే రక్షణ సిబ్బంది లేకుండా ఉండలేరు. అంటే భద్రతకు ఎంత ప్రముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని సామ్నా పేర్కొంది. అటువంటి భద్రత గాంధీ కుంటుంబానికి తొలగించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని స్పందించాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖలో ఇటువంటి నిర్ణయం ఎవరు.. ఎలా తీసుకుంటారని సామ్నా తన సంపాదకీయంలో ప్రశ్నించింది. గాంధీ కుటుంబానికి చెందినవారు కాకుండా ఆ స్థానంలో వేరే వాళ్లు ఉంటే. కేంద్రం ఇదే తరహాలో నిర్ణయం తీసుకుంటుందా.. అని సామ్నా తన సంపాదకీయంలో నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. కాగా గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసిన విషయం తేలిసిందే. ఇక దాదాపు 28 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను.. వారికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇకపై రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రతకై ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులను వినియోగించనుంది. కాగా 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. చదవండి: మీ అందరికీ ధన్యవాదాలు: రాహుల్ గాంధీ -
సఫారీ కారు..సాధారణ పోలీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒకప్పుడు ఇల్లు కదిలి బయటకు వస్తే రాణి వెడలె రవితేజములలరగా అన్నట్టుగా వాహనాల కాన్వాయ్, చుట్టూ పెద్దసంఖ్యలో కమాండోల రక్షణ వలయం ఉండేది. కానీ ఎస్పీజీ భద్రత తొలగించడంతో ఆమెకు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులుగా పదేళ్ల క్రితం నాటి టాటా సఫారీ కారు కేటాయించారు. ఇంటి దగ్గర సాధారణ పోలీసుల రక్షణ మాత్రమే ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ కింద 100 మంది సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత కల్పించారు. అప్పట్నుంచి సోనియా, ప్రియాంక బాలిస్టిక్ క్షిపణి దాడుల్నీ తట్టుకునేలా ఆధునీకరించిన రేంజ్ రోవర్ కార్లను వాడారు. ఇక రాహుల్ ఫార్చ్యూనర్ కారును వాడేవారు. ఇప్పడు భద్రత తొలగించి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కేటాయించడంతో ఆ వైభోగం అంతా తగ్గిపోయింది. వాయిదా తీర్మానం తిరస్కృతి, కాంగ్రెస్ వాకౌట్ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు అంశంపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రైతు సమస్యలు, ఢిల్లీ కాలుష్యం అంశాలు చర్చలు ఉన్నందున తీర్మానాన్ని స్పీకర్ బిర్లా తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సభ్యులు వెల్లోనికి దూసుకుపోయారు. ఎస్పీజీ భద్రత ఎందుకు తొలగించాలో ప్రధాని వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వాజ్‌పేయి హయాంలోనూ తొలగించలేదు కాంగ్రెస్ ఎంపీ రంజన్ చౌధరి మాట్లాడుతూ ‘‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సాధారణ వ్యక్తులు కాదు. గాంధీ కుటుంబానికి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎస్పీజీ భద్రత తొలగించలేదు. 1991 నుంచి వారికి ఎస్పీజీ భద్రత ఉంది. ఆ తర్వాత రెండు సార్లు ఎన్డీయే అధికారంలోకి వచ్చినా తొలగించలేదు. మరి ఇప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించారు. తిరిగి ప్రశ్నోత్తరాల సమయంలోనూ కాసేపు వాగ్వాదాలు నడిచాక కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. జేఎన్‌యూ వివాదంపై స్తంభించిన రాజ్యసభ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దాష్టీకం, కశ్మీర్లో రాజకీయ నేతల నిర్బంధం అంశాలపై రాజ్యసభ దద్దరిల్లింది. మంగళవారం సభ సమావేశం కాగానే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెతాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనిపై వాయిదా తీర్మానాలు అందాయని, ఆ అంశాలు వచ్చినప్పుడు చర్చ చేపడదామని చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పదే పదే చెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. తమ స్థానాల్లో కూర్చొనే ఈ రెండు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. సభకు రాహుల్ గైర్హాజరు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నకు స్పీకర్ సమయం కేటాయించినప్పటికీ ఆయన సభలో కనిపించలేదు. రాహుల్ ప్రశ్న జాబితాలో ఉంది. సభలో రాహుల్ ఉంటే ఆయనకు అవకాశం వచ్చేది అని బిర్లా వ్యాఖ్యానించారు. రాహుల్ సీటులో కూర్చొని ఎంపీ సురేష్ మాట్లాడబోతే వద్దని వారించారు. కేరళలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై రాహుల్ ప్రశ్న అడగాల్సి ఉండేది. -
గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న గాంధీ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ప్రస్తుతం కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)ను ఉపసంహరించుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం.. ఎస్పీజీని తొలగించి జెడ్‌ప్లస్ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కొరకు త్వరలోనే పార్లమెంట్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వార్తల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విపక్షాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా మాజీ ప్రధాని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కూడా ఇటీవల ఎస్పీజీ భద్రతను కేంద్రం ఉపసంహరించుకున్న విషయ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు జెడ్‌ప్లస్ భద్రతను కల్పిస్తున్నారు. -
మోడీ ప్రమాణానికి సన్నాహాలు
రాష్ట్రపతి భవన్లో భారీ ఏర్పాట్లు - 26న తరలి రానున్న ‘సార్క్’ దేశాల అధినేతలు - బీజేపీ ప్రధాన కార్యదర్శులతో రాజ్‌నాథ్ భేటీ - మోడీ తల్లికి, భార్యకు ఎస్పీజీ భద్రత న్యూఢిల్లీ: ఈ నెల 26న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ దేశాధినేతలు సహా సుమారు మూడువేల మంది హాజరు కానున్న ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద కార్యదర్శి ఒమితా పాల్ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థల అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మోడీ ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధినేతలు రానున్నారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధినేతలు తరలి రానుండటం ఇదే తొలిసారి. మోడీ తల్లికి, భార్యకు, సోదరులు, సోదరీమణులకు కావలసిన భద్రతను అంచనా వేసేందుకు ఎస్పీజీ కమాండోలు ఇప్పటికే ఢిల్లీ నుంచి గుజరాత్ బయలుదేరి వెళ్లారు. అవసరాలకు అనుగుణంగా వారికి భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర పోలీసులను కూడా ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 7 రేస్‌కోర్స్ రోడ్డులోని మోడీ అధికారిక నివాసం వద్ద, సౌత్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయం వద్ద వెయ్యిమంది బ్లాక్‌క్యాట్ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు, మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చర్చించేందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక లేఖ ద్వారా అభినందనలు తెలిపారు. కాగా, తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీ పంపిన ఆహ్వానానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మినహా మిగిలిన ‘సార్క్’ దేశాధినేతలందరూ స్పందించారు. వారితో పాటు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షెరింగ్ తాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ హాజరు కానున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా జపాన్ పర్యటనకు వెళుతున్నందున ఆమె తన తరఫున ప్రతినిధిని పంపనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలా వద్దా తేల్చుకోలేకపోతున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశంపై సైనిక ఉన్నతాధికారులు, పౌర సమాజం నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఆహ్వానం పంపి పాక్ ప్రధానిని ఇరకాటంలో పడేశారని దౌత్య నిపుణులు అంటున్నారు. నవాజ్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రాజపక్సకు ఆహ్వానంపై తమిళ పార్టీ గుర్రు శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు మోడీ ఆహ్వానం పంపడంపై తమిళ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమిళుల మనోభావాలను పట్టించుకోకుండా శ్రీలంక అధ్యక్షుడికి మోడీ ఆహ్వానం పంపడం దురదృష్టకరమని తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినాయకురాలు జయలలిత అన్నారు. డీంఎకే, ఎండీఎంకే తదితర తమిళ పార్టీలు సైతం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, ప్రధాని ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు ఆహ్వానం పంపడం ఆనవాయితీగా వస్తున్నదేనని, దీనిని ప్రజాస్వామిక వేడుకగా భావించాలని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. తల్లి దీవెనలతో ఢిల్లీకి... ప్రమాణ స్వీకారానికి మరో నాలుగు రోజులు సమయం ఉండగానే, గుజరాత్‌కు వీడ్కోలు పలికిన మోడీ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని, ఆమె దీవెనలు పొందారు. తన డ్రైవర్ సహా వ్యక్తిగత సిబ్బంది తన భద్రత కోసం తన ప్రభుత్వ వాహనంలోనే చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని, తనకోసం రోజూ కొన్నేళ్లుగా ప్రార్థనలు చేసేవారని ‘ట్విట్టర్’లో వెల్లడించారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు ‘ఆవ్జో గుజరాత్’ (వీడ్కోలు గుజరాత్) అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలో మోడీ ప్రభుత్వ ఏర్పాట్లపై మిగిలిన మూడు రోజులూ పార్టీ నేతలతో చర్చల్లో తలమునకలయ్యే అవకాశాలు ఉన్నాయి.