మోడీ ప్రమాణానికి సన్నాహాలు
రాష్ట్రపతి భవన్‌లో భారీ ఏర్పాట్లు
- 26న తరలి రానున్న ‘సార్క్’ దేశాల అధినేతలు
- బీజేపీ ప్రధాన కార్యదర్శులతో రాజ్‌నాథ్ భేటీ
- మోడీ తల్లికి, భార్యకు ఎస్పీజీ భద్రత
న్యూఢిల్లీ: ఈ నెల 26న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ దేశాధినేతలు సహా సుమారు మూడువేల మంది హాజరు కానున్న ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద కార్యదర్శి ఒమితా పాల్ ఇప్పటికే ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థల అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మోడీ ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధినేతలు రానున్నారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధినేతలు తరలి రానుండటం ఇదే తొలిసారి. మోడీ తల్లికి, భార్యకు, సోదరులు, సోదరీమణులకు కావలసిన భద్రతను అంచనా వేసేందుకు ఎస్పీజీ కమాండోలు ఇప్పటికే ఢిల్లీ నుంచి గుజరాత్ బయలుదేరి వెళ్లారు.
అవసరాలకు అనుగుణంగా వారికి భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్ర పోలీసులను కూడా ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 7 రేస్‌కోర్స్ రోడ్డులోని మోడీ అధికారిక నివాసం వద్ద, సౌత్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయం వద్ద వెయ్యిమంది బ్లాక్‌క్యాట్ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీజీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు, మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై చర్చించేందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు.
మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక లేఖ ద్వారా అభినందనలు తెలిపారు. కాగా, తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మోడీ పంపిన ఆహ్వానానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మినహా మిగిలిన ‘సార్క్’ దేశాధినేతలందరూ స్పందించారు. వారితో పాటు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, భూటాన్ ప్రధాని షెరింగ్ తాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ హాజరు కానున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా జపాన్ పర్యటనకు వెళుతున్నందున ఆమె తన తరఫున ప్రతినిధిని పంపనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలా వద్దా తేల్చుకోలేకపోతున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ అంశంపై సైనిక ఉన్నతాధికారులు, పౌర సమాజం నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఆహ్వానం పంపి పాక్ ప్రధానిని ఇరకాటంలో పడేశారని దౌత్య నిపుణులు అంటున్నారు. నవాజ్ తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
రాజపక్సకు ఆహ్వానంపై తమిళ పార్టీ గుర్రు
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు మోడీ ఆహ్వానం పంపడంపై తమిళ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమిళుల మనోభావాలను పట్టించుకోకుండా శ్రీలంక అధ్యక్షుడికి మోడీ ఆహ్వానం పంపడం దురదృష్టకరమని తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినాయకురాలు జయలలిత అన్నారు. డీంఎకే, ఎండీఎంకే తదితర తమిళ పార్టీలు సైతం ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే, ప్రధాని ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాలకు ఆహ్వానం పంపడం ఆనవాయితీగా వస్తున్నదేనని, దీనిని ప్రజాస్వామిక వేడుకగా భావించాలని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు.
తల్లి దీవెనలతో ఢిల్లీకి...
ప్రమాణ స్వీకారానికి మరో నాలుగు రోజులు సమయం ఉండగానే, గుజరాత్‌కు వీడ్కోలు పలికిన మోడీ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని, ఆమె దీవెనలు పొందారు. తన డ్రైవర్ సహా వ్యక్తిగత సిబ్బంది తన భద్రత కోసం తన ప్రభుత్వ వాహనంలోనే చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని, తనకోసం రోజూ కొన్నేళ్లుగా ప్రార్థనలు చేసేవారని ‘ట్విట్టర్’లో వెల్లడించారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు ‘ఆవ్జో గుజరాత్’ (వీడ్కోలు గుజరాత్) అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలో మోడీ ప్రభుత్వ ఏర్పాట్లపై మిగిలిన మూడు రోజులూ పార్టీ నేతలతో చర్చల్లో తలమునకలయ్యే అవకాశాలు ఉన్నాయి.