న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒకప్పుడు ఇల్లు కదిలి బయటకు వస్తే రాణి వెడలె రవితేజములలరగా అన్నట్టుగా వాహనాల కాన్వాయ్, చుట్టూ పెద్దసంఖ్యలో కమాండోల రక్షణ వలయం ఉండేది. కానీ ఎస్పీజీ భద్రత తొలగించడంతో ఆమెకు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులుగా పదేళ్ల క్రితం నాటి టాటా సఫారీ కారు కేటాయించారు. ఇంటి దగ్గర సాధారణ పోలీసుల రక్షణ మాత్రమే ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ కింద 100 మంది సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత కల్పించారు. అప్పట్నుంచి సోనియా, ప్రియాంక బాలిస్టిక్ క్షిపణి దాడుల్నీ తట్టుకునేలా ఆధునీకరించిన రేంజ్ రోవర్ కార్లను వాడారు. ఇక రాహుల్ ఫార్చ్యూనర్ కారును వాడేవారు. ఇప్పడు భద్రత తొలగించి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కేటాయించడంతో ఆ వైభోగం అంతా తగ్గిపోయింది.
వాయిదా తీర్మానం తిరస్కృతి, కాంగ్రెస్ వాకౌట్
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు అంశంపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రైతు సమస్యలు, ఢిల్లీ కాలుష్యం అంశాలు చర్చలు ఉన్నందున తీర్మానాన్ని స్పీకర్ బిర్లా తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోనికి దూసుకుపోయారు. ఎస్పీజీ భద్రత ఎందుకు తొలగించాలో ప్రధాని వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
వాజ్‌పేయి హయాంలోనూ తొలగించలేదు
కాంగ్రెస్ ఎంపీ రంజన్ చౌధరి మాట్లాడుతూ ‘‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సాధారణ వ్యక్తులు కాదు. గాంధీ కుటుంబానికి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎస్పీజీ భద్రత తొలగించలేదు. 1991 నుంచి వారికి ఎస్పీజీ భద్రత ఉంది. ఆ తర్వాత రెండు సార్లు ఎన్డీయే అధికారంలోకి వచ్చినా తొలగించలేదు. మరి ఇప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించారు. తిరిగి ప్రశ్నోత్తరాల సమయంలోనూ కాసేపు వాగ్వాదాలు నడిచాక కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
జేఎన్‌యూ వివాదంపై స్తంభించిన రాజ్యసభ
ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దాష్టీకం, కశ్మీర్‌లో రాజకీయ నేతల నిర్బంధం అంశాలపై రాజ్యసభ దద్దరిల్లింది. మంగళవారం సభ సమావేశం కాగానే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెతాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనిపై వాయిదా తీర్మానాలు అందాయని, ఆ అంశాలు వచ్చినప్పుడు చర్చ చేపడదామని చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పదే పదే చెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. తమ స్థానాల్లో కూర్చొనే ఈ రెండు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు.
సభకు రాహుల్ గైర్హాజరు
లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నకు స్పీకర్ సమయం కేటాయించినప్పటికీ ఆయన సభలో కనిపించలేదు. రాహుల్ ప్రశ్న జాబితాలో ఉంది. సభలో రాహుల్ ఉంటే ఆయనకు అవకాశం వచ్చేది అని బిర్లా వ్యాఖ్యానించారు. రాహుల్ సీటులో కూర్చొని ఎంపీ సురేష్ మాట్లాడబోతే వద్దని వారించారు. కేరళలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై రాహుల్ ప్రశ్న అడగాల్సి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment