ముంబై: మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకా తగ్గటం లేదు. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా.. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు శాసనసభ సెక్రెటరీ. అందులో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు సెక్రెటరీ. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నాయి. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్ చేశాయి. అయితే.. అనర్హత వేటు వేయాలన్న ఎమ్మెల్యేల జాబితాలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరును షిండే వర్గం మినహాయింటం గమనార్హం.
288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. అందులోంచి షిండే వర్గం తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బలపరీక్షలో 164 మంది మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై నాలుగున జరిగిన విశ్వాస పరీక్ష అనంతరం.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు విప్ ధిక్కరించారంటూ నోటీసులు ఇచ్చింది షిండే వర్గం.
ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ
Comments
Please login to add a commentAdd a comment