గంగానది కాలుష్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం!
న్యూఢిల్లీ: గంగా నది కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అటువంటి పరిశ్రమలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయాలని అవసరమైతే ఆ పరిశ్రమలను శాశ్వతంగా మూసివేయాలని సూచించింది. గంగా కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం గంగా నది కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై ఉక్కుపాదం మోపేందుకు హరిత ట్రిబ్యునల్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
దేశానికి జీవధార వంటి గంగా నదిలో కాలుష్య స్థాయిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా సంస్థాగతమైన వైఫల్యమని, ఈ అంశాన్ని కాలుష్య నియంత్రణ మండళ్లకే వదిలేస్తే మరో 50 ఏళ్లయినా పూర్తికాదని పేర్కొంది. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై హరిత ట్రిబ్యునల్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేసింది.
**