సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒక అధికారి కోర్టుకు హాజరుకావాలని సుప్రీం ఆదేశించింది. మార్చి 25లోగా దీనిపై బదులివ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని కోరింది.
ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ యంత్రాల స్లిప్పుల మధ్య వ్యత్యాసం నెలకొంటున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లకు, వీవీప్యాట్ యంత్రాలు జారీచేసిన రసీదులను సరిపోల్చి చూడాల్సిందేనని ఆయా పార్టీలు కోర్టును అభ్యర్ధించాయి.
కాగా, నియోజకవర్గంలో ఎంపిక చేసిన బూత్‌లోనే వీవీపాట్‌ల పరిశీలన చేపట్టాలన్న ఈసీ నిర్ణయాన్ని పిటిషనర్లు కోర్టులో సవాల్ చేశారు. ఈసీ నిర్ణయంతో పోలయిన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓట్లనే వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చుతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల సమర్ధ వినియోగానికి కనీసం సగం వీవీప్యాట్ స్లిప్‌లను పరిశీలించాలని పిటిషనర్లు కోరారు. ఈవీఎంలతో పాటు కనీసం 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోర్టును కోరింది. ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 రాజకీయ పార్టీల నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment