సుప్రీంకోర్టులో కర్ణాటకకు చుక్కెదురు
న్యూఢిల్లీ: కావేరి నది జల వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నేటి నుంచి రోజుకు 6 క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడుకు కావేరి నది నుంచి నీరు విడుదల చేయాలన్న తమ ఆదేశాలను పాటించని కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కావేరి నీళ్లు ఇవ్వడం కుదరదని కర్ణాటక అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సర్వోన్నత న్యాయస్థానం పట్టించుకోలేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశం ఏర్పాటు చేయాలని అటార్ని జనరల్ కు సుప్రీంకోర్టు సూచించింది. డిసెంబర్ తర్వాతే తమిళనాడుకు నీళ్లు ఇస్తామని, గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి సవరణ చేయాల్సిందిగా కర్ణాటక చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదంపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.