కావేరి జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తమిళనాడుకు కర్ణాటక నీటిని విడుదల చేసింది.
బెంగళూరు : కావేరి నదీ జలాల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి కర్ణాటక బుధవారం నీటిని విడుదల చేసింది. కృష్ణరాజ సాగర్ డ్యామ్ నుంచి అధికారులు ఇవాళ ఉదయం నీటిని విడుదల చేశారు. మరోవైపు కావేరి జలాల విడుదలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మండ్యాలోని సంజయ్ కూడలి వద్ద రైతులు నిరసన చేపట్టారు.
కావేరి జలాల విషయమై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృష్ణరాజసాగర రిజర్వాయర్ (కేఆర్ఎస్) వద్ద నిషేధాజ్ఞలను జారీ చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే కేఆర్ఎస్ను ముట్టడిస్తామంటూ కన్నడ సంఘాలు హెచ్చరించడంతో మండ్య జిల్లా అధికారులు కేఆర్ఎస్ వద్ద మూడురోజుల పాటు నిషేధాజ్ఞలు జారీ చేశారు.
కాగా కావేరి నదీ జలాల నుంచి తమిళనాడుకు రోజుకు 15వేల క్యూసెక్కుల చొప్పున పదిరోజుల పాటు నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.