సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే బోర్డు ప్రతిపాదనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చిన్నారులపై పుస్తకాల భారం మరింతగా మోపేందుకు సిద్దంగా లేమంటూ ఒక దేశం-ఒక బోర్డుపై దాఖలైన పిటిషన్‌ను ప్రోత్సహించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ‘మన చిన్నారులు ఇప్పటికే భారీ బ్యాగులు మోస్తున్నారు..ఈ బరువుతో వారి వీపులు బద్దలవుతున్నాయి..వారిపై మీరు మరింత భారం మోపాలని ఎందుకు అనుకుంటున్నార’ని న్యాయవాది, పిటిషనర్ అశ్వని ఉపాధ్యాయ్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. చిన్నారులపై సానుభూతితో వ్యవహరించాలని వారి స్కూల్ బ్యాగ్ బరువును పెంచడం తగదని కోర్టు పిటిషనర్‌కు సూచించింది.
దేశమంతటికీ ఒకటే విద్యా బోర్డు, ఉమ్మడి సిలబస్ ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్న డిమాండ్లు విధాన నిర్ణయాలకు సంబంధించినవని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన సంబంధ అంశాలను మీరు ప్రస్తావిస్తున్నారని, అన్ని బోర్డులను కలపాలని తాము ఎలా చెప్పగలమని కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. వివిధ రాష్ట్రాల బోర్డులు భిన్న సిలబస్‌లను అనుసరిస్తన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాను లేవనెత్తిన అంశాలు కీలకమైనవని పిటిషనర్ పేర్కొనగా, అవి ముఖ్యమైనవే అయినా న్యాయార్హమైనవి కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. పిటిషనర్ తను ముందుకు తెచ్చిన అంశాలపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment