
మైనర్లపై అఘాయిత్యం.. కీచక టీచర్ అరెస్ట్
ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ చేసిన నిర్వాకం తెలిస్తే అందరూ షాక్ తింటారు. విద్యాబుద్ధులు నెర్పించాల్సిన ఉపాధ్యాయుడు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తూ వచ్చాడు. చివరికి ఆ చిన్నారులు జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో ఆ కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.ఆర్ పాండే కథనం ప్రకారం.. తులసీరామ్ (40) ఓ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు బేసిస్ లో గ్రేడ్-3 టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్లో చదువుకునే ముగ్గురు విద్యార్థినులపై తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తొమ్మిది సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులపై, పదకొండేళ్ల మరో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. ఎవరికైనా చెప్పారంటే మీ అంతుచూస్తా అని బెదిరించేవాడు. గత నెల 29న ఓ చిన్నారి టీచర్ వేధింపులను తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అదేరోజు ముగ్గురు బాధిత చిన్నారుల పేరెంట్స్ హెడ్ మాస్టర్ కు తులసీరామ్ పై ఫిర్యాదుచేశారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి చిన్నారుల పేరెంట్స్ న్యాయం చేయాలని కోరుతూ సుల్తాన్ గంజ్ పోలీసులను ఆశ్రయించి, కీచక టీచర్ పై ఫిర్యాదు చేశారు. పలుమార్లు తమపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐపీసీ 376(2) సెక్షన్ కింద, చిన్నారులపై లైంగిక దాడుల చట్టం కింద పలు సెక్షన్లలో ఆ కీచక టీచర్ పై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. డీఈవో ఎస్.పీ త్రిపాఠి మాట్లాడుతూ.. టీచర్ తులసీరామ్ వేదింపులకు పాల్పడినట్లు రుజువైతే అతడిని జాబ్ నుంచి తొలగిస్తామన్నారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయని హెడ్ మాస్టర్ పై కూడా డీఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు.