► చట్టాలను సవరించేందుకు ఇదే సమయం
► పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు అవసరం
► రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పద్ధతిలో పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచేందుకుగానూ చట్టపరమైన నిబంధనలను సవరించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రస్తుత భారత పార్లమెంటరీ వ్యవస్థలో తక్కువ సీట్లు ఉన్న రాజకీయ పార్టీలు కూడా సమానమైన హక్కులను పొందుతున్నాయని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యం చూపుతున్నా.. ఎటువంటి బాధ్యతా వారిపై ఉండటంలేదని అన్నారు.
శనివారం ఢిల్లీలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించి జరిగిన సెమినార్‌లో సీజేఐ జస్టిస్ ఖేహర్‌తో కలసి ప్రణబ్ పాల్గొన్నారు. సీజేఐ ఖేహర్ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలను రాజకీయ పార్టీలు నెరవేర్చడం లేదని, పార్టీ మేనిఫెస్టోలను కాగితం ముక్కల మాదిరిగా చూస్తున్నారని, పార్టీలకు ఎటువంటి జవాబుదారీతనం లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పేర్కొన్నారు.
సీజేఐ సందర్భానుసారం జవాబుదారీతనం గురించి లేవనెత్తారని, కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వందకు 51(మెజారిటీ) వస్తే వారికి అధికారం, అన్ని హక్కులు సంక్రమించేలా మన ఎన్నికల ప్రక్రియ ఉందని, అలాగే 51 కంటే తక్కువ వచ్చిన వారు కూడా అన్ని అధికారాలు, హక్కులను పొందుతున్నారని, కానీ వారికి ఎటువంటి జవాబుదారీతనం ఉండటం లేదని ప్రణబ్ ఈ సందర్భంగా చెప్పారు.