15వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి
రాష్ట్రపతికి కొత్త ఎంపీల జాబితా ఇచ్చిన ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం 15వ లోక్‌సభను రద్దు చేశారు. కేబినెట్ సూచన మేరకు ఆయన 15వ లోక్‌సభను రద్దుచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. రాజ్యాంగంలోని 85వ అధికరణంలో క్లాజ్ (2) సబ్‌క్లాజ్ (బి) ప్రకారం తనకు గల అధికారాల మేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దుచేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రెస్ కార్యదర్శి వేణు రాజామొనీ వెల్లడించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో శనివారం రాష్ట్రపతితో తుదిసారి భేటీ అయిన కేంద్ర కేబినెట్, 15వ లోక్‌సభను రద్దు చేయాలని సూచించింది. కేబినెట్ సూచన మేరకు 15వ లోక్‌సభను తక్షణమే రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ రాష్ట్రపతిని కలుసుకుని, కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుని, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ 44 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన మొత్తం 543 మంది సభ్యుల జాబితాను ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్, ఎన్నికల కమిషనర్లు హెచ్‌ఎస్ బ్రహ్మ, నసీం జైదీలు ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని, కొత్త సభ్యుల జాబితా ప్రతిని అందజేశారు.
15వ లోక్‌సభ విశేషాలు...
తాజాగా రద్దయిన 15వ లోక్‌సభ 2009- 14 కాలంలో 345 రోజులు మాత్రమే సమావేశమై, 1,331 గంటలు పనిచేసింది. అధికార పక్షానికి, విపక్షాలకు నడుమ ఎక్కువగా రాద్ధాంతాలతోనే గడిచిన సభలో, సభా కార్యకలాపాలు పూర్తిగా వెనుకబడ్డాయి. 1952-67 వరకు పనిచేసిన తొలి మూడు లోక్‌సభలు సగటున 600 రోజులు సమావేశమై, 3,700 గంటలకు పైగా పనిచేశాయి. తొలినాళ్లతో పోలిస్తే, 15వ లోక్‌సభ పరిస్థితి దయనీయమైన స్థితికి దిగజారింది.
15వ లోక్‌సభ నిర్ణీత సమయంలో 63% సమయాన్ని మాత్ర మే ఉపయోగించుకుంది. మొత్తం సమయంలో 13% మాత్ర మే శాసన కార్యకలాపాలకు వినియోగించుకోగలిగింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన శీతాకాల సమావేశాల్లో మొత్తం 31 బిల్లులను ఆమోదించాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం లోక్‌పాల్ బిల్లు మాత్రమే ఆమోదానికి నోచుకుంది.
శాసన కార్యకలాపాల కోసం వెచ్చించాల్సిన సమయం 15వ లోక్‌సభలో గణనీయంగా క్షీణించడంతో చాలా బిల్లులు ఆమోదం పొందలేకపోయాయి. తొలి లోక్‌సభలో (1952-57) 333 బిల్లులు ఆమోదం పొందగా, 15వ లోక్‌సభలో అందులో దాదాపు సగం... అంటే, 165 బిల్లులు మాత్రమే ఆమోదానికి నోచుకున్నాయి.
పార్లమెంటులో ప్రస్తుతం 126 బిల్లులు పెండింగులో మిగిలాయి. వాటిలో 72 లోక్‌సభలో ఉండగా, 54 బిల్లులు రాజ్యసభలో పెండింగులో ఉన్నాయి. 15వ లోక్‌సభ రద్దుతో లోక్‌సభ వద్ద పెండింగులో ఉన్న బిల్లులన్నింటికీ కాలం చెల్లినట్లే. కాలం చెల్లిన వాటిలో విదేశీ విద్యా సంస్థల బిల్లు, ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు, గనులు ఖనిజాల బిల్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల బిల్లు సహా పలు ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.
ఈసీకి రాష్ట్రపతి అభినందనలు
లోక్‌సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల కమిషన్‌ను అభినందించారు. 16వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను తనకు సమర్పించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, ఎన్నికల కమిషనర్లు హెచ్‌ఎస్ బ్రహ్మ, నాసిం జైదీలను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ఓటర్లకు 9 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడంపై ఆయన ప్రశంసలు కురిపించారు.