ఒకేసారి ఎన్నికలు మంచిదే!
• ఎన్నికల సంఘం చొరవతీసుకోవాలన్న రాష్ట్రపతి
• రిపబ్లిక్‌డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగం
• నగదురహితంతో పారదర్శకత వస్తుందన్న ప్రణబ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన మంచిదని.. దీని అమలుకోసం ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రణబ్.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. దీనివల్లతలెత్తే ఇబ్బందులు తాత్కాలికమేనని అన్నారు. ‘అవినీతిపై పోరాటం, నల్లధనాన్ని అరికట్టే ప్రయత్నంలో తీసుకొచ్చిన నోట్లరద్దు కారణంగా తాత్కాలికంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి.
ఇబ్బందులు తలెత్తాయి. లావాదేవీలు నగ దు రహితంగా మారటం వల్ల మన ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది’ అని ముఖర్జీ స్పష్టం చేశారు. ‘2016–17 ప్రథమార్థంలో వృద్ధిరేటు 7.2గా ఉంది. మనం ఆర్థిక స్థిరత్వం దిశగా వెళ్తున్నాం. ద్రవ్యోల్బణం కూడా సౌకర్యవంతంగానే ఉంది. ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రయత్నం దేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు.
ప్రజాస్వామ్యమే పట్టుకొమ్మ
‘ఇప్పటికే నెలకొన్న అలసత్వాన్ని ప్రశ్నించుకోవాలి. వ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జరిగినట్లుగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరిగిన విధానం మళ్లీ అమల్లోకి రావాలి’ అని రాష్ట్రపతి తెలిపారు. ఈ దిశగా ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ యథావిధిగా ఎన్నికలు నిర్వహించటం ద్వారానే విశాలమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వెలుగులీనుతుందన్నారు. ఇప్పటికీ పార్లమెంటు, అసెంబ్లీల్లో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగకుండా ఆందోళనలు, నిరసనలతో వాయిదా పడటం బాధాకరం. అన్ని పార్టీలూ సంయుక్త కృషితో మళ్లీ అర్థవంతమైన చర్చ జరిగేలా చొరవతీసుకోవాలి’ అని ప్రణబ్ తెలిపారు.
సహనశీలతకు పరీక్ష
భారతదేశంలో శతాబ్దాలుగా భిన్న ఆలోచనలు, భిన్న సిద్ధాంతాలు ఒకదానితో ఒకటిశాంతియుతంగా పోటీపడ్డాయని.. దేశ గొప్పదనమంతా భిన్నత్వం, బహుళత్వంలోనే ఉందన్నారు. ‘మన దేశంలోని బహుళత్వం, సహనశీలతకు కొన్ని శక్తులు పరీక్ష పెడుతున్నాయి. జాగ్రత్తగా గమనించి ముందడుగేయాల్సిన అవసరం ఉంది’ అని రాష్ట్రపతి సూచించారు. ఉగ్రవాదంపై పోరు జరుపుతూనే మన సైనికుల సంక్షేమం గురించీ మరింత దృష్టిపెట్టాలన్నారు. అంతకుముందు, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరపాలన్న ఆలోచనకు ప్రణబ్ మద్దతు తెలిపారు.