‘మండలి’ గందరగోళానికి తెర
* ఎమ్మెల్సీ స్థానాల కోటాపై స్పష్టత
* పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం
* ఎమ్మెల్యే కోటాలో ఒకటి కట్
* స్థానిక సంస్థల కోటాలో 3 అదనం
* ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యే కోటాకు ఎన్నికల షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం శాసన మండలిలో స్థానాల అంశంపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నుకునే సభ్యుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యలో మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ పంపిన ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేయటంతో గురువారం గెజిట్ వెలువడింది. దీంతో రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఒక స్థానం తగ్గిపోయింది. స్థానిక సంస్థల కోటాలో మాత్రం అదనంగా మూడు సీట్లు పెరగనున్నాయి. జనాభా ప్రాతిపదికన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సీట్లు పెంచే అవకాశముంది. అంటే ఈ మూడు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఇద్దరేసి ఎమ్మెల్సీలు ఎన్నికవుతారు.
విభజనతో గందరగోళం..
పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర శాసనమండలికి మొత్తం 40 సీట్లు కేటాయించారు. అందులో ఎమ్మెల్యే కోటాలో 14 సీట్లు.. స్థానిక సంస్థల కోటాలో 14 సీట్లు.. గవర్నర్ కోటాలో ఆరు, పట్టభద్రుల కోటాలో మూడు, టీచర్ల కోటాలో మూడు సీట్లుగా నిర్దేశించారు. కానీ విభజన జరిగే నాటికి ఎమ్మెల్యే కోటాలో 15 మంది, స్థానిక సంస్థల కోటాలో 11 మంది సభ్యులు ఉండడం గందరగోళానికి దారి తీసింది. ఇక ఇటీవల ఎమ్మెల్యే కోటాలోని ఏడుగురు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి స్థానాల సంఖ్య, కోటా విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)ను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. దీనిపై సీఈసీ కేంద్ర హోంశాఖను సంప్రదించగా.. కోటాల్లో మార్పులు చేస్తూ సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఎమ్మెల్యే కోటాలో పదవీ విరమణ చేసిన కేఆర్ ఆమోస్ మినహా మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సూచించారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల కోటా స్థానాల సంఖ్యను 14కు పెంచాలని, ఇందుకోసం ఆయా స్థానాల పునర్విభజన చేపట్టాలని పేర్కొన్నారు.
ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్..
ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇక స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఆయా స్థానాల పునర్విభజన చేపట్టిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. జనాభా ప్రాతిపదికన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా సీట్లను పెంచేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ కోటాలో ఆదిలాబాద్, వరంగల్ స్థానాలు రెండేళ్ల కిందే ఖాళీ అయ్యాయి. వివిధ కారణాలతో వాటికి ఎన్నికలు జరగలేదు. ఇదే కోటాలోని మరో ఏడుగురు ఎమ్మెల్సీలు మే ఒకటో తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ లెక్కన స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉంటుందని ఈసీ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు గవర్నర్ కోటాలోనూ ఒక సీటు మార్చి 29న ఖాళీ అయింది. దీన్ని సైతం భర్తీ చేయాల్సి ఉంది.