రహస్య బ్యాలెట్
సీఎం ఎన్నికకు బీజేపీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై బీజేపీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని ఎల్జీని కోరాలని భావిస్తోంది. జాతీయ ప్రాదేశిక ప్రాంత చట్టం, 1991లో అందుకు అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. చట్టంలోని సెక్షన్ 9(2) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో రహస్య ఓటింగ్ నిర్వహించాలి. అందులో ఎక్కువమంది అభ్యర్థులు బలపర్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు. ఇప్పటిదాకా బిల్లును ఆమోదించే విషయంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కూడా ఈవిధానాన్ని అనుసరించవచ్చు.
ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత సభలో అత్యధిక మెజార్టీ ఉన్న పార్టీ అధికారపక్షం, ఆ తర్వాత ఎక్కువ మంది సభ్యులున్న పార్టీ ప్రతిపక్షం అవుతుంది. అయితే ఈ చట్టం ప్రకారం పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అంతేకాక ఏ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఎవరిని బలపర్చారో కూడా తెలిసే అవకాశం లేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేస్తున్నారు.
అలాకాకుండా అసెంబ్లీలో మెజార్టీ సభ్యులున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తమకేమీ అభ్యంతరం లేదని సతీశ్ స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని, ఈ మూడు ప్రతిపాదనల్లో తాము దేనినైనా అంగీకరిస్తామని ఉపాధ్యాయ్ తెలిపారు. కాగా బీజేపీ చేసిన ఈ డిమాండ్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రహస్య ఓటింగ్ నిర్వహించడమంటే బేరసారాలకు బహిరంగంగా తలుపులు తెరిచినట్లేనని పేర్కొంటున్నారు.