న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) కింద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భద్రతా ఖర్చులను వెల్లడించడానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నిరాకరించింది. ఇది వ్యక్తిగత, గోప్యతకు సంబంధించిన అంశమని, ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపింది. హోం మంత్రిత్వశాఖ సెక్షన్ 8(1) ప్రకారం సమాచారం బహిర్గతం చేయలేమని, అలా చేస్తే ఆ వ్యక్తి ప్రాణానికి హాని కలిగే అవకాశముందని చెప్పింది.
ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నారు, ప్రభుత్వ ఖజానా నుంచి దానికెంత చెల్లిస్తున్నారో వెల్లడించాలంటూ 2014 జూలై 5న దీపక్ జునేజా అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశారు. దరఖాస్తు నాటికి అమిత్ షా పార్లమెంట్ సభ్యుడు కాదు. అయితే సీఐసీ ఆదేశాలను జునేజా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల జెడ్ ప్లస్ భద్రతా ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించరాదంటూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అమిత్‌షా 2014 జూలైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారని, అది ఎలాంటి రాజ్యాంగ పదవి కాకపోయిన ప్రభుత్వ నిధి నుంచి ఎందుకు భద్రతా ఖర్చులను భరిస్తున్నారో వెల్లడించాలన్నారు.
ప్రమాదంలో ఎవరు ఉన్నా వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని హోం మంత్రిత్వశాఖ విన్నవించింది. వారి ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర భద్రతా ఏజెన్సీల నుంచి వచ్చిన నివేదికలను విశ్లేషించిన తర్వాతే వారికి భద్రత కల్పించినట్లు తెలిపింది. ఇప్పటికే వారు పెద్ద ఎత్తున బెదిరింపులకు గురవుతున్నారని, ఇప్పుడు వారి ఖర్చు సమాచారం బహిర్గతం చేస్తే శత్రువులు భద్రతను అంచనా వేస్తారంది. దీంతో ప్రమాదం పెరిగే అవకాశముందని చెప్పింది. జడ్ ప్లస్ భద్రత పూర్తిగా వ్యక్తిగతం, గోప్యత హక్కుకు సంబంధించినదని, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన గోప్యత హక్కును ఉటంకిస్తూ దీనికి ఆర్టీఐ చట్టం వర్తించదని పేర్కొంది. వాదనల అనంతరం హైకోర్టు వ్యాజ్యాన్ని కొట్టేసింది.
ఆయన భద్రత ఖర్చులను వెల్లడించలేం: సీఐసీ
Published Mon, Aug 27 2018 5:28 PM | Last Updated on Mon, Aug 27 2018 5:29 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment