వాఘెలా రాహుల్‌కు ముఖం చాటేశారు
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పార్టీ సీనియర్ నేత శంకర్‌సిన్హా వాఘెలా ముఖం చాటేశారు. ట్విట్టర్‌లో రాహుల్‌ను అనుసరించడాన్ని విరమించుకున్నారు. ఆయన రాహుల్‌ని మాత్రమే కాకుండా మరోసీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్, జీపీసీసీ ప్రెసిడెంట్ భరత్‌సిన్హ సోలంకీ తదితరులను కూడా ఆయన ఆదివారం ట్విట్టర్లో అన్‌ఫాలో అయ్యారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సైబర్ సమావేశం జరగడానికి కొద్ది సేపట్లోనే ఆయన ట్విట్టర్‌లో రాహుల్‌ను అన్‌ఫాలో అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సైబర్ సెల్‌కు మార్గనిర్దేశాలు చేసే వ్యక్తుల్లో వాఘెలా కూడా ఒకరు.
బాపుగా పిలిచే వాఘెలా గత కొద్ది కాలంగా కాంగ్రెస్ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందుకు ఫలితంగానే తాజాగా ఆయనను రాహుల్‌ను విడవడం జరిగిందంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని గత కొద్ది నెలలుగా వాఘెలా కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. పైగా ప్రస్తుతం ఎన్నికల్లో ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోమంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. త్వరలో గుజరాత్‌లో ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర నేతల మధ్య వ్యవహారం పొసగడం లేదని, ఒకరిపై ఒకరు తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. తాజా పరిణామం చూస్తే అది నిజమేనేమోనని, గుజరాత్ కాంగ్రెస్‌లో ఏదో జరగబోతుందంటూ పలువురు కథనాలు అల్లేయడం మొదలుపెట్టారు.