సీఎంతో కటీఫ్.. శరద్ యాదవ్ సొంత కుంపటి!
పాట్నా: మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకున్న తర్వాత బిహార్‌లో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ కొత్త కుంపటి పెట్టుకునేలా కనిపిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి పాత మిత్రపక్షమైన బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన జేడీయూ నేత నితీశ్‌కుమార్ నిర్ణయంపై ఆ పార్టీ అగ్రనేత శరద్‌యాదవ్ ఇంకా అసంతృప్తి జ్వాలలు కురిపిస్తున్నారు.
శరద్ యాదవ్ సన్నిహితుడైన విజయ్ వర్మ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలువురు జేడీయూ నేతలను శరద్‌యాదవ్ కలుసుకోనున్నారని తెలిపారు. తమ భావజాలంతో జోడు కుదిరే పార్టీలతోనూ శరద్ యాదవ్ చర్చిస్తున్నారని చెప్పారు. కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విజయ్ వర్మ అన్నారు. ముఖ్యంగా నితీశ్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రజా తీర్పును గౌరవించకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సీనియర్ నేత శరద్ యాదవ్ ర్ణించుకోలేక పోతున్నారు.
ఇదే అంశంపై జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ పాట్నాలో మీడియాతో మాట్లాడారు. శరద్ తమ పార్టీ సీనియర్ నేతని, అయితే కొత్త మార్గం ఎంచుకునే అవకాశం ఉందన్నారు. శరద్ యాదవ్ తనకు నచ్చిన నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడ్డారు. ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ పేరిట ఆగస్టు 27వ తేదీన ఆర్జేడీ నిర్వహిస్తున్న ర్యాలీలో జేడీయూ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన శరద్ యాదవ్ పొల్గొననున్నారు.