మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. సునంద పుష్కర్ అనుమానాస్పద కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన సిట్... సునంద భర్త శశిథరూర్ను కూడా విచారిస్తోంది. అయితే స్పెషల్ ఇన్విస్టిగేషన్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ న్యూఢిల్లీ పోలీసులు శశిథరూర్ను హెచ్చరించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
దీనిపై సోషల్ మీడియాలో శశిథరూర్ మీడియాపై విరుచుకుపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కట్టుకథలు ప్రసారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. తాను విచారణకు సహకరించడం లేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం అబద్ధాలను, అసత్యాలను ప్రసారం చేసే మీడియా కాకుండా, నీతిగా, నిజాయితీగా వ్యవహరించే జర్నలిజం మన దేశానికి చాలా అవసరం అంటూ ట్వీట్ చేశారు.
మీడియా చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని శశిథరూర్ కొట్టిపారేశారు. ముఖ్యంగా కేరళ చానళ్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిజాలను ప్రతిబింబించని మీడియా అని అర్థం వచ్చేలా ప్లకార్డును తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు మీడియాకి చెప్పే ముందు తనను వివరణ అడిగి వుంటే బావుండేదని శశిథరూర్ ట్విట్ చేశారు. సునంద కేసులో సిట్ ఇప్పటికే ఆయనను రెండుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్ళకూడదన్న నిబంధన ప్రకారం సిట్ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకున్న శశిథరూర్ తన సొంత నియోజవర్గం తిరువనంతపురం పర్యటనలో ఉన్నారు.