సునంద కేసులో నేడు థరూర్ విచారణ
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఆమె భర్త శశిథరూర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ గురువారం మరోసారి ప్రశ్నించనుంది. సునంద తనయుడు శివ్‌మీనన్‌ను సిట్ బృందం ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు విచారించిన సాక్షుల వాంగ్మూలాలను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని అంశాలకు సంబంధించి వివరణ కోసం శశిథరూర్‌ను విచారించనున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి బుధవారం విలేకరులకు తెలిపారు.
ఈ కేసును విచారిస్తున్న పోలీస్ బృందం ఇప్పటివరకు దాదాపు 15 మందిని ప్రశ్నించింది. శశిథరూర్ వ్యక్తిగత సిబ్బందితోపాటు ఆయన స్నేహితులను కూడా విచారించారు. మరోవైపు సునందకేసు విచారణలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
ఇందులో ప్రచారం కోసం తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోందని కాబట్టి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమంది. అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్‌జైన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఐదుగురు అత్యంత సీనియర్ అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ కేసు దర్యాప్తు చేస్తోందని కోర్టుకు తెలిపారు.