
ఆర్టికల్ 370 రద్దుపై రాద్ధాంతం చేస్తున్న పాక్ తీరును కాంగ్రెస్ నేత శశిథరూర్ తీవ్రంగా తప్పుపట్టారు. భారత అంతర్గత వ్యవహారంలో ఏ దేశం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ తీరును కాంగ్రెస్ నేత శశి థరూర్ ఎండగట్టారు. ఈ అంశంపై భారత ప్రభుత్వ ఉద్దేశాన్ని ఏ దేశం ప్రశ్నించలేదని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దును విపక్షాలుగా తాము ప్రశ్నిస్తామని, ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వాన్నీ మరే దేశం ప్రశ్నించలేదని పేర్కొన్నారు. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఇక జమ్ము కశ్మీర్ ప్రజలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీరీలను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా నియంత్రణలు విధిస్తున్నారని వాపోయారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లడం లేదని, కశ్మీరీలపై ఆంక్షలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు.