కుంగిన శిఖరం: షీలాదీక్షిత్
దేశ రాజకీయ కేంద్రమైన ఢిల్లీని వరుసగా 15 ఏళ్ల పాటు పాలించిన తిరుగులేని రికార్డు షీలాదీక్షిత్ సొంతం. అయితేనేం, ‘ఆమ్ ఆద్మీ’ రాజకీయ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవలేకపోయారామె. షీలా సారథ్యంలో కాంగ్రెస్ మట్టి కరవడమే గాక స్వయంగా ఆమె కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 75 ఏళ్ల షీలా తన రాజకీయ జీవితంలో ఇంతటి పరాభవాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
ప్రజాగ్రహం, ప్రభుత్వ వ్యతిరేకత, కొత్తగా వచ్చిన ఏఏపీ గాలితో పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు అసమర్థ పాలన, అంతులేని అవినీతి, భారీ కుంభకోణాలు కూడా షీలా పాలిట శాపాలుగా మారాయి. 1938లో పంజాబ్‌లోని కపుర్తలలో జన్మించిన షీలా, కేంద్ర మాజీ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ కోడలిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1984లో యూపీలోని కనౌజ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998లో అనూహ్య రీతిలో ఢిల్లీ కాంగ్రెస్ శాఖ పగ్గాలతో పాటు సీఎం పదవినీ చేపట్టినా... అభివృద్ధి, సుపరిపాలన నినాదాలతో 2003, 2008ల్లో అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే 2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో రాజ్యమేలిన విచ్చలవిడి అవినీతికి కళ్లెం వేయలేకపోయారన్న అపకీర్తిని ఆమె మూటగట్టుకున్నారు.