మోదీ స్కీమ్కు 200 కిలోల షిరిడీ బంగారం!
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్కు దేవాలయాల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటీవలే సిద్ధి వినాయక దేవాలయం 40 కేజీల బంగారాన్ని ఈ పథకం కింద డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకోగా తాజాగా షిరిడీ సాయి బాబా ఆలయం నిర్వాహకులు ఇదే బాటలో పయనించాలని భావిస్తున్నారు. అయితే షిరిడీ సాయి దేవాలయ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో.. 200 కేజీల బంగారాన్ని ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని భావిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయానికి గతంలో బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకిగా ఉంది. భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని కరగదీయొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా బంగారాన్ని డిపాజిట్ చేసే విధంగా కోర్టు నుండి అనుమతులు పొందడానికి పిల్ దాఖలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. బంగారంపై వచ్చిన వడ్డీని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని, కోర్టు నుండి అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే షిరిడీ ఆలయంలోని బాబా విగ్రహంపై ఉన్నటువంటి 180 కేజీల బంగారాన్ని మాత్రం అలాగే ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. అది కాకుండానే 200 కిలోల బంగారం షిరిడీ ఆలయానికి ఉంది. బంగారానికి భద్రత ఏర్పాట్లు చేయడం ఆలయ నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేయాలని నిర్ణయించారు.