
ఎన్నికల వేళ.. శివసేన పత్రికా ప్రకటనలు!
మహారాష్ట్రలో ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు శివసేన భారీ పత్రికా ప్రకటనలతో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజు ఇలా ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ, బాల ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేల ఫొటోలు, బాణం గుర్తుతో భారీ ప్రకటన ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తామే ప్రధాన పోటీదారులం అన్నట్లుగా ఈ ప్రకటనలు గుప్పించింది. తమ పార్టీ అధికారిక పత్రికలైన సామ్నా, దోపహర్కా సామ్నా పత్రికల్లో బుధవారం నాటి ఎడిషన్ మొదటిపేజీలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చింది. 'ధనుష్య బాణ్ కీ టంకార్ హై, ఆనీ అబ్ అప్నీ సర్కార్ హై' అని ఇందులో నినాదం ఇచ్చింది. ధనస్సు, బాణం శివసేన ఎన్నికల గుర్తు. వాటిని గుర్తు చేసేలా.. ఈసారి మన ప్రభుత్వమే రావాలంటూ ఈ ప్రకటన ఇచ్చింది.
అలాగే, ముంబైలోని ఇతర మీడియాకు మరో రకం పెద్ద ప్రకటన ఇచ్చింది. అందులో అయితే.. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకునేలా ఉంది. ''రావణుడిని హస్తంతో (కాంగ్రెస్ గుర్తు), వాచీతో (ఎన్సీపీ) లేదా పువ్వుతో (బీజేపీ) చంపలేదు. ధనస్సుతో బాణం వేసి చంపారు'' అని ఆ ప్రకటనలో ఉంది. అవినీతి, విద్యుత్ కోతలు, విధాన సంక్షోభం, దుష్పరిపాలన.. వీటన్నింటినీ అరికట్టాలంటే ధనస్సు, బాణాలకు ఓటు వేయాలన్నది ఆ ప్రకటనల సారాంశం.