మహారాష్ట్రలోని బీజేపీ సర్కారులో శివసేన చేరేందుకు రంగం సిద్ధమైంది.
‘మహా’ సర్కారులో చేరికకు సిద్ధం
ముంబై: మహారాష్ట్రలోని బీజేపీ సర్కారులో శివసేన చేరేందుకు రంగం సిద్ధమైంది. శివసేనకు 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు తెలిసింది. ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకోవటంపై శివసేనతో చర్చలు 70 నుంచి 80 శాతం పూర్తయినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం ప్రకటించటం తెలిసిందే. విబేధాలను పక్కనపెట్టి కలసి పనిచేసేలా ఆమోద యోగ్యమైన ప్రతిపాదనలకు రెండు పార్టీలూ అంగీకరించినట్లు శివసేన సీనియర్ నేత ఒకరు మంగళవారం తెలిపారు.
దీని ప్రకారం ఫడ్నవిస్ సర్కారులో శివసేనకు 5 క్యాబినెట్ హోదా పదవులతో కలిపి మొత్తం 12 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ తమకు ఇవ్వాలన్న డిమాండ్‌పై శివసేన బెట్టు సడలించింది. శివసేనకు పరిశ్రమలు, పర్యావరణం, ఆరోగ్యం, రవాణా/ఎక్సైజ్ తదితర శాఖలను కేటాయించే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలే మృతితో బుధవారం జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం కొద్ది రోజులు వాయిదా పడనుందని శివసేన సీనియర్ నేత ఒకరు తెలిపారు.